(ఈరోజు-అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి పాడేరు)
కూటమి ప్రభుత్వంలో మరోసారి స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు(సచివాలయ) ఉద్యోగుల రేషనలైజేషన్ అంశం జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో మరోసారి తెరపైకి వచ్చింది. ఉద్యోగులకు పనిభారం పెరగకుండా ప్రత్యేకంగా ఉద్యోగులకు శాఖల వారీగా జాబ్ చార్ట్ తయారు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గురువారం జరగిన సమీక్షలో సచివాలయ ఉద్యోగుల సమస్యలపై సీఎం ప్రస్తావించారు. విశాఖలో సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టిన తరువాత జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ అంశం మళ్లీ ప్రస్తావనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో సుమారు 74 ప్రభుత్వశాఖల్లో ఉద్యోగులు వేల సంఖ్యలో రిటైర్ అయిపోతున్నారు. ఈ క్రమంలో మళ్లీ సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ అంశం మాత్రమే వచ్చింది తప్పతే ఉద్యోగులకు కల్పించాల్సిన ప్రయోజనాలు, సమస్యల పరిష్కారంలో ఎలాంటి చర్చ జరగకపోవడం విశేషం.
ఆంధ్రప్రదేశ్ లోని 75వ ప్రభుత్వశాఖగా ఉన్న స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామం ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనులు చేయించుకోవాలి.. వారికి ఎలాంటి పనులు అప్పగించాలి.. అనే దానిపై ప్రత్యేకంగా చర్చించారు. “స్వర్ణవార్డు, గ్రామ కార్యాలయాలకు ఒక్కో ఈవీ సైకిల్ ఇవ్వాలి. స్వర్ణవార్డు, గ్రామ కార్యాలయాల్లో ఒక్కో ఉద్యోగికి ఒక్కో బాధ్యత మాత్రమే అప్పగించాలనే విధానం కష్టసాధ్యమైంది. కొంతమందిపై ఎక్కువ పని భారం ఉంటే.. మరికొందరికి చాలా తక్కువ పని ఉంటోంది. దీన్ని సరిచేసి రేషనలైజ్ చేయాలి. పనిభారం పెంచకుండా వివిధ బాధ్యతలను అప్పగించేలా చూడాలి. ప్రతి పంచాయతీ పరిధిలోని స్వర్ణ గ్రామ సిబ్బంది విధుల స్పష్టత కోసం జాబ్ ఛార్ట్ సిద్ధం చేయాలి” అని సీఎం ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులు విధుల్లోకి చేరి ఏడు సంవత్సరాలు పూర్తవుతున్నా వీరికి ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన అంశాలపై చర్చించని అధికారులు.. వారితో ఏ విధంగా పనిచేయించాలనే కోణంలో మాత్రమే చర్చించడం విశేషం. మరో ప్రక్క రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం పెద్దఎత్తున ఆందోళన చేపడుతున్నప్పటికీ ఆ విషయాన్ని ప్రభుత్వం పెద్ద సీరియస్ గా తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
-ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తున్న కూటమి సర్కారు
రాష్ట్రంలో 75 ప్రభుత్వశాఖల్లో ఉద్యోగులు పనిచేస్తుంటే.. 74 ప్రభుత్వశాఖలకు ప్రయోజనాలు ఒకరకంగానూ.. 75వ ప్రభుత్వశాఖగా ఉన్న స్వర్ణగ్రామం, స్వర్ణవార్డు ఉద్యోగులకు మరో రకంగానూ ప్రభుత్వం విభజించి చూడటాన్ని ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. దానితో రోడ్డు ఎక్కి ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడంలేదు. ఆందోళన చేసిన ప్రతీసారి ఏదో ఒక సాకు చెప్పి అప్పటికీ ఆందోళనపై నీళ్లు చల్లుతున్నది. దీనితో తమను అన్ని పనులకు వినియోగించుకుని తమ సమస్యలు పరిష్కారం అడితే అదిగో ఇదిగో అంటున్న ప్రభుత్వానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ఉద్యోగులు అపుడే ప్రచారంలోకి దించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్వర్ణవార్డు, స్వర్ణ ఉద్యోగుల అంశాలన్ని అసెంబ్లీలోనూ, శాసన మండలిలోనూ పెద్ద చర్చ లేవనెత్తి తప్పుని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నెట్టి నేటికి రెండున్నరేళ్లు దాటిపోతున్నా.. ఉద్యోగులకు పదోన్నతులు, పేస్కేలు, సర్వీసురూల్స్, నోషనల్ ఇంక్రిమెంట్లు.. తొమ్మిదినెలల పేస్కేలు బకాయిలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు మిగిలిన అన్నిశాఖలకు యదావిధిగా పదోన్నతులు, డీఏలు, పేస్కేలు, పీఆర్సీ ప్రయోజనాలు కల్పిస్తున్న ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల విషయంలో ప్రతీ అంశంలోనూ కొర్రీ వేస్తూ వస్తున్నది.
-కలెక్టర్ల కాన్ఫరెన్సుకి ముందు చేసిన ఆందోళన చేసినా ఫలితం లేదు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు క్యాబినెట్ సమావేశాలు, జిల్లా కలెక్టర్ల సమీక్షలు జరుగుతున్న సమయంలో మూకుమ్మడిగా ఆందోళనలు చేసినా ఫలితం ఉండటం లేదు. ఏదో కంటితుడుపు ప్రకటనలు తప్పా.. ఉద్యోగుల సమస్యలు పరిష్కార మార్గం ఎక్కడా కనిపించడం లేదు. విశాఖలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ రోడ్డుపై బైటాయించి ఆందోళన చేసిన తరువాత కూడా స్వర్ణవార్డు, స్వర్ణగ్రామం డైరెక్టర్ ఇలాంటి ఆందోళనలు చేయడం తప్పు అని చెప్పారు తప్పితే.. మీకు రావాల్సిన ప్రయోజనాలు ప్రభుత్వం పలానా సమయంలో పరిష్కరిస్తుందని మాత్రం ఎక్కడా హామీ ఇవ్వలేదు.. పైగా సమస్యలు పరిష్కరించడానికి సమయం కావాలని.. కొన్ని సమస్యలు ఇప్పటికే ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని కాకమ్మ కబుర్లు చెప్పి తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ల కాన్ఫరెన్సులో సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన అంశం చర్చకు వచ్చినా.. వారిని ఏ విధంగా విభజన చేసి వివిధ పనులు వినియోగించుకోవాలనే దానిపైనే ప్రధానంగా చర్చ జరగడం విశేషం. వీటిని నిసితంగా పరిశీలిస్తున్న సచివాలయ ఉద్యోగులు సరైన సమయంలో వారి సమాధానం భారీ స్థాయిలో చెప్పక మానరని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. మళ్లీ ఉద్యోగుల రేషనలైజేషన్, జాబ్ చార్జ్ అంటూ వచ్చిన సీఎం ఆదేశాలు ఏ స్థాయిలో ఉద్యోగులపై ప్రభావం చూపుతాయనేది వేచి చూడాల్సిన అంశం..!




