(ఈరోజు-చింతపల్లి/గూడెంకొత్తవీధి, అల్లూరి పాడేరు)
జర్రెల అటవీ ప్రాంతంలో భారీ స్థాయిలో బాక్సైట్ నిల్వలు ఉన్నట్లు భూగర్భ సర్వేలు గతంలోనే గుర్తించాయి. దీంతో సుమారు 1,212 హెక్టార్ల అటవీ భూమిలో తవ్వకాలకు ప్రతిపాదనలు రూపొందించబడ్డాయి. అయితే పీసా చట్టం, అటవీ హక్కుల చట్టం, 1/70 భూ బదలాయింపు నియంత్రణ నిబంధనల ప్రకారం గ్రామసభల అనుమతి లేకుండా ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదని గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకించారు. దశాబ్దాలపాటు సాగిన ప్రజా ఉద్యమాలు, పర్యావరణవేత్తల పోరాటాలు, ప్రజా సంఘాల ఆందోళనల ఫలితంగా అప్పటి ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాల లీజులను రద్దు చేయాల్సి వచ్చింది. అయితే ఇటీవల జర్రెల అటవీ ప్రాంతంలో రహస్యంగా మట్టి నమూనాలు సేకరిస్తూ తిరుగుతున్న నలుగురు వ్యక్తులను స్థానికులు అడ్డుకుని పట్టుకోవడం సంచలనంగా మారింది. ఈ ఘటనతో బాక్సైట్ అంశం మళ్లీ మన్యంలో చర్చనీయాంశమైంది. ఖనిజ మాఫియా మళ్లీ అడుగుపెడుతోందా? రహస్య సర్వేల పేరుతో మైనింగ్‌కు బాటలు వేస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
- కొండలు పోతే...ఊటలు ఎండిపోతాయి.
జెర్రెల కొండలపై ఉన్న బాక్సైట్ పొరలు సహజ జలాశయాల్లా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వర్షపు నీటిని నిల్వచేసి కిందనున్న వందలాది ఊటలకు, వాగులకు, సెలయేళ్లకు జీవం పోసేది ఈ కొండలేనని నిపుణులు పేర్కొంటున్నారు. బాక్సైట్ తవ్వకాల కోసం కొండల పైభాగాన్ని తొలగిస్తే సహజ జలవ్యవస్థ పూర్తిగా దెబ్బతిని అనేక గ్రామాల్లో తాగునీటి సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
-అడవి తల్లి గుండెలకు గాయాలు
బాక్సైట్ తవ్వకాలంటే కేవలం మట్టిని తవ్వడం కాదు. వేల ఎకరాల అటవీ సంపదను నేలమట్టం చేయడం. అరుదైన ఔషధ మొక్కలు, వన్యప్రాణుల ఆవాసాలు, జీవవైవిధ్యానికి నిలయమైన పచ్చని అడవిని శాశ్వతంగా నాశనం చేయడం. ఒకసారి అడవి నరికివేస్తే దానిని తిరిగి పునరుద్ధరించడానికి దశాబ్దాలు పట్టినా పూర్వ వైభవం తిరిగి రాదని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.
- విషధూళితో ఆరోగ్యానికి ముప్పు
కొండలను పేల్చివేసే ప్రక్రియలో వెలువడే ధూళి, రసాయన అవశేషాలు, భారీ వాహనాల రాకపోకల వల్ల వాతావరణ కాలుష్యం పెరిగే ప్రమాదం ఉంది. శ్వాసకోశ వ్యాధులు, చర్మవ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేడు పచ్చని గాలి పీలుస్తున్న గిరిజన గ్రామాలు రేపు ధూళి మేఘాల మధ్య జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-ఉద్యోగాల పేరుతో ఉపాధి కోల్పోయే ప్రమాదం
మైనింగ్ కంపెనీలు ఉద్యోగాల పేరుతో మాయమాటలు చెప్పినా, తాత్కాలికంగా కొద్దిమందికి మాత్రమే పనులు దక్కుతాయని గిరిజన సంఘాలు చెబుతున్నాయి. అడవిపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలు మాత్రం తమ భూములు, పోడు వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, పశుపోషణ వంటి శాశ్వత జీవనాధారాలను కోల్పోతాయని పేర్కొంటున్నాయి. చివరికి స్వగ్రామాలు వదిలి పట్టణాలకు వలస వెళ్లి కూలి పనులు చేయాల్సిన దుస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-మన్యంలో గిరిజనుల హెచ్చరిక
బాక్సైట్ కోసం కొండలను తవ్వేస్తే మన్యం భవిష్యత్తునే తవ్వేసినట్లే...కొండలు ఉంటేనే ఊటలు ఉంటాయి...ఊటలు ఉంటేనే గ్రామాలు బతుకుతాయి. అడవిని అమ్ముకుని అభివృద్ధి పేరుతో విధ్వంసాన్ని అంగీకరించం అని గిరిజన మేధావులు, పెద్దలు స్పష్టం చేస్తున్నారు.
-ఉద్యమానికి సిద్ధమవుతున్న మన్య ప్రాంత ప్రజలు
ఇటీవల పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో జర్రెల అటవీ ప్రాంతాన్ని సందర్శించి బాక్సైట్ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ప్రకటించడంతో అంశం మరింత వేడెక్కింది. అవసరమైతే గ్రామసభల నుంచి రాష్ట్రస్థాయి ఉద్యమాల వరకు పోరాటాన్ని విస్తరిస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అల్లూరి జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. బాక్సైట్ తవ్వితే కొండలు మిగలవు...కొండలు లేకుంటే ఊటలు మిగలవు...ఊటలు ఎండిపోతే మన్యం బతకదు...మన్యం బతకకపోతే గిరిజనుల భవిష్యత్తే శూన్యం అవుతుంది అనే నినాదం ప్రస్తుతం జర్రెల కొండల్లో మారుమోగుతోంది.




