(ఈరోజు-అనకాపల్లి)
కచోరీలు అనగానే మనకి వెంటనే రాజస్తాని వంటకాలు గుర్తుకి వస్తాయి.. అలాగనీ ప్రతీసారి ఆ రాజస్తానీ స్నాక్ షాప్ కి వెళ్లి తెచ్చుకోలం లేం కదా.. ఇంటర్నెట్ పుణ్యమాని ఇపుడు ఎలాంటి వంటకమైనా ఇట్టే తెలుసుకునే అవకాశం ఏర్పడింది. అంతేనా ఇపుడు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని స్పెషల్ స్నాక్ లు వలస వచ్చిన వ్యాపారులు అన్ని ప్రాంతాల్లోనూ అమ్మకాలు సాగిస్తున్నారు. భారతదేశంలో రాజస్థాన్ లో ఎంతో ప్రసిద్ధి చెందిన స్పైసీ, కరకరలాడే డీప్-ఫ్రైడ్ స్నాక్స్. అన్నీచోట్లా దొరుకున్నాయి. మైదా లేదా గోధుమ పిండితో చేసి, పెసరపప్పు (మూంగ్ దాల్), ఉల్లిపాయలు, లేదా ఆలుగడ్డల మిశ్రమాన్ని లోపల స్టఫింగ్ గా పెట్టి నూనెలో వేయిస్తారు. ఈ కచోరీ రెసిపీ తెలియనంత వరకే మనం బయట కొనేది.. ఒక్కసారి ఆ వంటకం గురించి తెలిస్తే.. తగ్గేదే లేదు.. ఇంట్లోనే మనం కూడా బ్యాకరీ స్టైల్ ఉల్లి కచోరీలు చేసి తీరాలంతే. ఇపుడు అదే రాజస్థాన్ ఆనియన్ కచోరీ రెసిపీ మీ ముందుకి తీసుకు వచ్చాం. ఇక్కడ పేర్కొన్న విధంగా చేస్తే మీకూ బయట దొరికే కర కరలాడే కచోరీల టేస్త్ వచ్చేస్తుంది.

-కావలసిన పదార్థాలు:
కప్పు - మైదా, శనగ పిండి - స్పూను, ఉడికించిన ఆలు - రెండు, చక్కెర - అర స్పూను, కారం - స్పూను, ఆమ్‌చూర్‌-స్పూను, ధనియాలు - స్పూను, జీలకర్ర - అర స్పూను, ఉల్లి - ఒకటి, గరం మసాలా-అర స్పూను, పచ్చి మిర్చి - రెండు, వెల్లుల్లి పేస్టు - స్పూను, ఇంగువ-కాస్త, ఆవాలు-అర స్పూను, నూనె, నీళ్లు, ఉప్పు- తగినంత, కొద్దిగా కొత్తమీర తరుగు..

-తయారుచేసే విధానం:
ఓ గిన్నెలో మైదా పిండి, ఉప్పు, స్పూను నూనె, కాస్త నీళ్లు వేసి పూరీ పిండిలా కలుపుకుని మూత మూసి పక్కన పెట్టాలి. ఉల్లి, మిర్చిలను కట్‌ చేసుకోవాలి. ఉడికించిన ఆలూను ముద్దగా చేసుకోవాలి. ఓ బాణలిలో స్పూను నూనె వేసి వెల్లుల్లి, అల్లం పేస్టు, ఇంగువ, జీలకర్ర, చక్కెర, ఆవాలు చిటపటలాడించాలి. ఆ తరవాత ధనియాలు, ఉల్లి, మిర్చి, ఉప్పు చేర్చాలి. ఉల్లిరంగు మారుతుంటే కారం, ఆలూ, ఆమ్‌చూర్‌, శనగ పిండి, గరం మసాలా, కొత్తిమీర తరుగు వేయాలి. అంతా దగ్గరకి అవుతుంటే స్టవ్‌ కట్టేసి, చల్లారనివ్వాలి. పిండిని చిన్న ముద్దలుగా చేసుకుని, ఈ ముద్దలో ఆలూ మిశ్రమాన్ని ఉంచి కచోరీలా చేసుకుని నూనెలో వేయిస్తే సరి. కచోరీలు సిద్దం అవుతాయి. కాకపోతు..అవి వేగేటపుడు జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే మాడిపోతాయి.

-కచోరీల్లో సరైన మంచింగ్ ఇదే
కచోరీలను చింతపండు చట్నీ, కారం పచ్చిమిర్చి చట్నీ, లేదా ఆలూ కర్రీ, టమాటా కెచప్ తో కలిపి తింటారు. సాయంత్రం వేళల్లో టీ లేదా కాఫీతో నంజుకోవడానికి ఇవి అద్భుతమైన ఎంపిక అని మనం గుర్తుంచుకోవాలి. ఇపుడు అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని శుభకార్యాలయాల్లో కొత్త రకం వంటకాలు తయారు చేయించాలనుకునే వారు ఇపుడు ఈ `ఆనియన్ కచోరీలను చేయిస్తున్నారు. కాస్త చేయి తిరిగిన వారు ఇంట్లోనే చక్కగా వీటిని తయారు చేసి సాయంత్రం స్నాక్ గా వడ్డించేస్తున్నారు మరి.. అంతాలా ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫేమస్ అయిపోయాయి.. రాజస్తానీ ఆనియన్ కచోరీలు..!