(విశాఖపట్నం, పశ్చిగోదావరి-ఈరోజు ప్రతినిధి)
కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖ(స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామం)ను ప్రక్షాళన చేసే చర్యలకు పూనుకుంది.. మొన్న పంచాయతీ కార్యదర్శిలకు పేస్కేలు రివర్స్ చేసిన ప్రభుత్వం.. ఇపుడు పశు సంవర్ధకశాఖలోని నకిలీలను ఏరివేసేందుకు ముందడుగు వేసింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 28జిల్లాల్లోని 15వేల4 సచివాలయాల్లో పనిచేస్తున్న పశు సంవర్ధకశాఖ సహాయకులకు స్వయంగా మెమోలు పంపింది. ఉద్యోగాల్లో చేరినపుడు మీరుసమర్పించిన క్వాలిఫైడ్ సర్టిఫికేట్లు ఒరిజనలా.. నకిలీవా.. అని.. అంతకు ముందు సచివాలయశాఖలోని నకిలీలు ఉన్నారనే విషయం ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాల ద్వారా వెలుగులోకి తీసుకు వచ్చింది. అంతేకాకుండా పశ్చిమగోదావరి జిల్లాలో లక్షలాది రూపాయలు చేతులు మారి చాలా మంది దొడ్డిదారిన ఉద్యోగాల్లోకి చేరిన విషయం కూడా వార్తల ద్వారా బయటపెట్టింది. సుమారు 1200 మందికి పైగా నకిలీలు ఉన్నారనే మీడియా కథనాలపై స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే ఈ ఆదేశం కూడా ముందుగా నకిలీలకు నెలరోజు ల ముందే ఉప్పందించిన తరువాత మాత్రమే మెమోలు జారీచేశారనే ఆరోపణలున్నాయి.. అదీ ఎందుకంటే విచారణ చేసినా నకిలీల మరకలు బయట పడకుండా సదరు సంస్థల నుంచి ముందుగానే ఎన్వోసీలు తెచ్చుకుంటారని ఆ విధంగా చేశారనే సమాచారం అందుతుంది.
-సిఐడీ విచారణ అయితే నేరుగా విద్యా సంస్థల నుంచే విచారణ
రాష్ట్రప్రభుత్వం ఎప్పుడైనా నకిలీల సర్టిఫికేట్ల వ్యవహారం, ఉద్యోగాలా వ్యవహారం బయటకు వచ్చినపుడు దానిని సిఐడీకి అప్పగిస్తుంది. సీఐడీ మొత్తం తీగలాడి డొంకంతా కదుపుతుంది. ఇలాంటి వ్యవహారమే విశాఖజిల్లాలో జరిగినపుడు నేరుగా ఈ అంశాన్ని రాష్ట్రప్రభుత్వమే సిఐడీకి అప్పగించింది. అపుడు సిఐడీ ఇచ్చిన నివేదికలో నకిలీలు బయటపడి వైద్యఆరోగ్యశాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ రద్దు కావడంతోపాటు.. ఉద్యోగాలొచ్చిన వారు కూడా ఆ ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పశుసంవర్ధశాఖ సహాయకుల సర్టిఫికేట్లను కూడా రాష్ట్రప్రభుత్వం సిఐడీతో విచారణ జరిపించాలి. కానీ స్వయంగా పశుసంవర్ధకశాఖ విచారణ జరుపుతుందని.. ఒక ఫార్మాట్ సర్క్యులర్ తోపాటు విడుదల చేసింది. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా పశుసంవర్ధకశాఖలోని సహాయకుల సమాచారం అన్ని జిల్లాల నుంచి రాష్ట్రప్రభుత్వం తీసుకొని..దానినే సిఐడీకి అప్పగించడం ద్వారా వాస్తవాలు బయటకు వచ్చేవి. కానీ పశుసంవర్ధకశాఖలోని లక్షలాది రూపాయలు చేతులు మారిన కారణంగా నేరుగా ఆ శాఖ మాత్రమే విచారణ చేసే విధంగా సర్క్యులర్ జారీచేశారని చెబుతున్నారు.
-నకిలీలు, వారికి సహకరించిన వారి గుండెల్లో రైళ్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పశుసంవర్ధకశాఖలో నకిలీ సర్టిఫికేట్ల ద్వారా ఉద్యోగాల్లోకి వచ్చిన వారికి ఇపుడు పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ దామోదరనాయుడు జారీ చేసిన సర్క్యులర్ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నది. అంతేకాకుండా ఈ విషయం రాష్ట్ర సచివాలయశాఖలోని కొందరు ఉన్నతాధికారులకు కూడా ప్రమోయం ఉందని కూడా తెలుస్తుంది. వారి ద్వారా జిల్లాల్లోని జిల్లా అధికారులు కూడా ఈ నకిలీల వ్యవహారంలో భారీగా నగదు చేతులు మారి ఉద్యోగాల కల్పన జరిగినట్టు చెబుతున్నారు. అయితే ఈ విషయం కాస్తా మీడియాలో కథనాలుగా రావడం, ఈరోజు-ఈఎన్ఎస్ వరుస కధనాలు వెలువరించడంతో ప్రభుత్వం స్పందించింది. అయితే ఆ స్పందన పశుసంవర్ధశాఖ అధికారులు ఇచ్చిన విచారణ ఆదేశం కాస్త పేలవంగా ఉందనే ఆరోపణలున్నాయి.. ఎక్కడైనా ఎప్పుడైనా నకిలీ వ్యవహారం జరిగితే దాని విచారణ సిఐడీ ద్వారా చేపడతారు. కానీ నకిలీలపై విచారణకు ఆదేశిలిచ్చిన పశుసంవర్ధకశాఖ చేపడితే దొంగలు బయటకు వస్తారా..? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగాలు కోల్పోయిన అభ్యర్ధులు, పదోన్నతుల కోల్పోయిన ఉద్యోగులు.
రాష్ట్రవ్యాప్తంగా పశుసంవర్ధకశాఖ జారీచేసిన ఫేక్ సర్టిఫికేట్లపై ఎంక్వైరీ సర్క్యులర్ గ్రామ, వార్డు సచివాలయశాఖలోని నకిలీల విషయంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దానికి తోడు ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన మీడియా కథనాలు కూడా నకిలీలు, వారికి సహకరించిన వారిని తీవ్రంగా వెంటాడుతున్నాయి. అసలు పశుసంవర్ధకశాఖలో ఏం జరుగుతుందనే ఆశక్తికర విషయం రేపటి కథనంలో..!




