(ఈరోజు-విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి పాడేరు(అమరావతి)
ఆలు లేదు..సూలు లేదు కొడుకుపేరు సోమలింగం అన్నట్టుగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగు పదోన్నతుల వ్యవహారం ఏడేళ్ల తరువాత ఇన్నాళ్లకు మెరిట్ లిస్టుల వరకూ వచ్చింది. అదేంటి మెరిట్ లిస్టులు ప్రకటిస్తే.. పదోన్నతులు వచ్చేసినట్టే కదా అనుకోకండి. అది మిగిలిన 74 ప్రభుత్వశాఖల్లో అయితే జరుగుతుందేమో కానీ.. ఒక్క సచివాలయ ఉద్యోగుల విషయంలో మాత్రం జరుగుతుందనడానికి మాత్రం ఎక్కడా అవకాశాలు లేవు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా తూర్పారబట్టిన బట్టిన కూటమి ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు. అయితే ఉద్యోగులు హైకోర్టుకి వెళితే కోర్టు నుంచి చీవాట్లు తినాల్సి వస్తుందని...అధికార యంత్రాంగం ఏమీ చేయకుండా లేదు అని చెప్పుకోవడానికి మాత్రం తాజాగా మెరిట్ లిస్టులను మాత్రం బయట పెడుతున్నాయి మాతృశాఖలు.
అయితే ఎలాంటి సర్వీసు నిబంధనలు లేని ప్రభుత్వశాఖగా గుర్తింపు పొందిన గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు ఆది నుంచి నష్టాలు.. కష్టాలు.. అదనపు పని భారం, అధికారుల వేధింపులు మాత్రం సమాయానికంటే ముందుగానే వచ్చేస్తున్నాయి. ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులు మాదిరిగా ప్రయోజనాలు ఇవ్వాల్సి వస్తే మాత్రం గత ప్రభుత్వం మీ భవిష్యత్తుని గాల్లో పెట్టేసిందని అధికారులు చేతులెత్తేస్తున్నారు. అదే అధికారులు కూటమి ప్రభుత్వంలోనూ పనిచేస్తున్నారని చిన్న లాజిక్ మరిచి పోయి వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు లేకుండా తామేమీ చేయలేమని అధికారులు కూడా తెగేసి చెబుతున్నారు. పదోన్నతులు వచ్చేవరకూ ప్రభుత్వశాఖలు విడుదుల చేస్తున్న మెరిట్ లిస్టులతో ఆనంద పడిపోండని ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు.
అలు ఏ ప్రభుత్వశాఖ లేని ఉద్యోగులుగా మిగిలిపోయిన మహిళాపోలీసులకు రెండు ఆప్షన్లు ఇచ్చినా 70శాతం మంది ఎంచుకోకపోవడంతో ఎంచుకున్నవారిని ఏం చేయాలో కూడా తెలియకుండా ఉంది. అయితే అలా పోలీసు శాఖ ఆప్షన్లు ఎంచుకున్నవారికి మాత్రం స్టేషన్లకు అటాచ్ చేస్తారనే ప్రచారం మాత్రం గట్టిగా సాగుతుంది. అసలు కోర్టుకేసులు అధికంగా ఉన్నది వీరి నియామంలోనే అయినా ప్రభుత్వం ఏం చేస్తున్నదనే విషయం ఎవరికీ తెలియకుండా పోయింది. అటు ఉద్యోగుల పదోన్నతులు, సర్వీసు నిబంధనలు, కోల్పోయిన పేస్కేలు, పీఆర్సీ ప్రయోజాలు ఇచ్చేందుకు ఏర్పాటైన కమిటీ మాత్రం ఇప్పటి వరకూ ఒక్క నివేదిక కూడా ఇవ్వలేదు. దానితో ప్రభుత్వం ఇపుడు హడావిడీ చేస్తున్న మెరిట్ లిస్టులతో కొంత కాలం గడిపేస్తే.. ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది.. ఇంకా ఈలోగా బదిలీల ప్రక్రియలో మొత్తం అంతా మరిచిపోతారు.. అన్నట్టుగానే ప్రభుత్వం వ్యవహరిస్తున్నది.
అయితే తమను ఇన్నివిధాలు అదనపు పనికి వినియోగించుకుని తమకు అన్యాయం చేసిన కూటమికి మాత్రం గుర్తుండిపోయేలా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటున్నారు ఉద్యోగులు..అవసరం అయితే న్యాయ పోరాటం ద్వారా తమకు రావాల్సిన పదోన్నతులు సాధించుకుంటామని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రచారం ఉద్యోగుల చరవాణి గ్రూపుల్లో పెద్ద ఎత్తున చక్కర్లుకొడుతున్నది. చూడాలి ఉద్యోగులకు కూటమి పదోన్నతులు ఇస్తుందా లేదా అనేది..?!




