(ఈరోజు-విశాఖపట్నం)
కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు(స్వర్ణ వార్డు, స్వర్ణ పంచాయతీ) పదోన్నతులు కల్పించడానికి చర్యలు చేపట్టి.. మెరిట్ లిస్టులు తయారు చేస్తున్న వేళ పశుసంవర్ధకశాఖలో బయటపడుతున్న నకిలీల వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంటోంది.. పశుసంవర్ధకశాఖలో నకిలీలున్నారని.. వారి సంఖ్య గట్టిగానే ఉందని.. వారికి సహరించిన అధికారులు, సిబ్బంది బయటకు వస్తాయరని ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాలను అందిస్తే.. ఆ మీడియాలో రాస్తే నిజమైపోతుందా..? ఆధారాలు చూపించాలి కదా అన్న పశుసంవర్ధకశాఖలోని అక్రమార్కులకు గొంతులో పచ్చి వెలక్కాయ్ పడ్డట్టు అయ్యింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 371 సచివాలయాల్లో పోస్టులు భర్తీచేసింది. అందులో 152 సచివాలయాలు అల్లూరి జిల్లాలో ఉన్నాయి.. అనకాపల్లి జిల్లాలో 198 సచివాలయాలు ఉన్నాయి.. మిగిలినవి విశాఖజిల్లాలో ఉన్నాయి. వారికి ప్రభుత్వ ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేశారు. ఉద్యోగులు సమర్పించిన సర్టిఫికేట్ల పరిశీలన చేస్తే అందులో 38 నకిలీవని(అంటే ఇక్కడ ఉద్యోగంలోకి చేరిపుడు సమర్పించినవి.. తరువాత సమర్పించినవి పొంతన కుదరలేదు) తేలింది. దీనితో ప్రాధమిక సమాచారాన్ని స్టేట్ కమిషనరేట్ కి పంపారు విశాఖలోని జాయింట్ డైరెక్టర్ కార్యాలయ అధికారులు. ఈ విషయాన్ని ఈరోజు-ఈఎన్ఎస్ గత కొద్ది రోజులుగా ప్రత్యేక వార్తా కధనాలు అందిస్తూ వస్తున్నది. ఎట్టకేలకు అధికారులు గ్రామీణ పశుసంవర్ధక సహాయకులు సర్టిఫికేట్లు పరిశీలన చేయడంతోవాస్తవాలు బయటకు వచ్చాయి. కొందరు ఉద్యోగాలు వచ్చిన కొత్తలో పెట్టిన సర్టిఫికేట్లు నకిలీవని తేలితే.. ఇబ్బందులొస్తాయని సర్వీసులో ఉండగానే రెగ్యులర్ కోర్సులు చదివి వాటిని కూడా ప్రభుత్వానికి సమర్పించారు. అది చట్టరీత్యా నేరం ఆ విషయాన్ని కూడా రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో అధికారులు, కార్యాలయ సిబ్బంది ప్రభుత్వం దృష్టికి ఆ కీలకమైన సమాచారాన్ని తీసుకెళ్లలేదు. దానితో కొందరు ఉద్యోగులకు అనుమానం వచ్చి లోకా యుక్తాకి ఫిర్యాదు చేయడంతో.. ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సిబ్బంది సర్టిఫికేట్లపై విచారణ చేపట్టంది. దానితో అన్ని జిల్లాల్లో పదుల సంఖ్యలో అక్రమార్కులు బయటకు వస్తున్నారు.
-తప్పించుకునే పనిలో అక్రమార్కులు
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందిన వారిపై కూటమి ప్రభుత్వంలో విచారణ జరగడంతో పక్కా ఆధారాలతో బయటపడిన నకిలీలు తప్పించుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అంతేకాదు వీరిపై ఎలాంటి చర్యలు పడకుండా న్యాయపరంగా ఎదుర్కొనే సలహాలు కూడా ఇదే పశుసంవర్ధకశాఖ అధికారులు ఉద్యోగులకు ఇస్తున్నట్టుగా కీలక సమాచారం అందుతోంది. ఎందుకంటే వీరికి ఉద్యోగాలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఏడేళ్ల క్రితం పశుసంవర్ధకశాఖలోని అధికారులు, మినిస్టీరియల్ సిబ్బంది కూడా భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని చెబుతున్నారు. ప్రస్తుతం నకిలీ సర్టిఫికేట్లు బయట పడటంతో ఇపుడు వారిని ఉద్యోగాల్లో నియమించిన సమయంలో వాటి వెరఫికేషన్ సక్రమంగా చేయని అధికారులు.. తప్పుడు సర్టిఫికేట్లని తేలిన తరువాత అవినీతికి పాల్పిన అధికారుల గుండెల్లో కూడా ఇపుడు రైళ్లు పరుగెడుతున్నాయి. ఎలాగైనా న్యాయపరంగా వీటిని ఎదుర్కోవడానికి, నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారం నుంచి బయటపడటానికి అపుడే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా సర్వీసులో వుంటూ రెగ్యులర్ గా కోర్సులు చేసి..సర్టిఫికేట్లు సమర్పించిన సమయంలో జిల్లా కార్యాలయ అధికారులు ఆ విషయాన్ని స్టేట్ కమిషనరేట్ చెప్పకోవడం కూడా అధికారులు పాల్పడిన అవినీతో భాగమే చెబుతున్నారు.
-నకిలీల ఉద్యోగాలు ఊస్టింగేనా..? కొద్ది చర్యలతో వదిలేస్తారా..?
పశుసంవర్ధకశాఖ డైరెక్టరేట్, కమిషనరేట్ ఆదేశాలతో విచారణ చేపట్టిన అధికారులు ఉద్యోగులు సమర్పించిన సర్టిఫికేట్ల ఆధారంగా సచ్చీలత కోసం వారు సమర్పించిన బోర్డులు, యూనివర్శిటీలకు వెరిఫికేషన్ కు పంపామని.. ఇంకా కొన్ని విచారణ చేయాల్సి వుందని విశాఖజిల్లా జాయింట్ డైరెక్టర్ డా. నీలయ్య ఈరోజుకి వివరణ ఇచ్చారు. అదేవిధంగా సర్వీసులో ఉండగా రెగ్యులర్ కోర్సులు చదివిన విషయంపై జారీచేసిన నోటీసులకు, ఉద్యోగులు ఇచ్చిన వివరణలను కూడా కమిషనరేట్ కి పంపామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విచారణ మాత్రమే చేసి రిపోర్టుని ప్రభుత్వానికి నివేదించామని చెప్పారు. వాస్తవాలు తేలితే డైరెక్టరేట్ నుంచి వచ్చిన ఆదేశాలు, చర్యలు మాత్రమే తాము అమలు చేయాడానికి ఉందని.. అంతకు మించి తాము ఏమీ చేయలేమని ఆయన వివరించారు. అయితే ఇక్కడ ఉద్యోగులు ఏడేళ్లు ప్రభుత్వ సర్వీసులో ఉన్న విషయమై అభ్యర్ధులు కోర్టుని ఆశ్రయించే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. అక్కడకి వెళ్లినా ఇన్ సర్వీసులో రెగ్యులర్ కోర్సులు చేయడానికి ప్రభుత్వ ఆదేశాలు అవసరమనే సాంకేతిక కారణంగ కూడా ఉండటంతో అక్కడ కూడా అక్రమార్కులకు ఫలిదం దక్కే అవకాశం కనిపించడం లేదు. అదే సమయంలో రెగ్యులర్ ఉద్యోగులు, రెగ్యులర్ కోర్సులు చదివిన సమయంలో జరిగిన తెరవెనుక కార్యక్రమాలపై విచారణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే అడ్డదారిలో రెగ్యులర్ కోర్సులు చేసిన వారికి సహకరించిన అధికారులు, సిబ్బందిపై కూడా చర్యలు పడే అవకాశం వుంటుందని అధికారులు చెబుతున్నారు.చూడాలని నకిలీలపై పశుసంవర్ధకశాఖ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది..?!
-రెగ్యులర్ ఉద్యోగులు ఈ విధంగా సెలవు తీసుకొని చదువుకోవాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ( ఫండమెంటల్ రూల్స్(ఎఫ్ఆర్- 84 & 85) ప్రకారం, ఉద్యోగుల విద్యావసరాల కోసం స్టడీ లీవ్ ప్రభుత్వం మంజూరు చేస్తుంది. దానికి అర్హత ఉద్యోగికి కనీసం 5 సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ ఉండాలి. ప్రొబేషనరీ పీరియడ్‌లో ఉన్న ఉద్యోగులు ఈ సెలవుకు అర్హులు కాదు.వయోపరిమితి/సర్వీస్ షరతు: ఉద్యోగి ఉద్యోగ విరమణకు ఇంకా కనీసం 3 సంవత్సరాల సర్వీస్ మిగిలి ఉండాలి.సెలవు కాలపరిమితి మొత్తం సర్వీసులో గరిష్టంగా 24 నెలల (2 సంవత్సరాలు) వరకు స్టడీ లీవ్ మంజూరు చేస్తారు. ఇతర సెలవులతో కలిపి ఇది 28 నెలలు మించకూడదు. అదే సమయంలో జీతభత్యాలు స్టడీ లీవ్ సమయంలో ఉద్యోగికి హాఫ్-పే లీవ్ లేదా సగం జీతం మాత్రమే లభిస్తుంది. అయితే, డిపార్ట్‌మెంట్ అవసరాల దృష్ట్యా ఈ కోర్సు ఉంటే ప్రభుత్వం స్కాలర్‌షిప్ లేదా ప్రత్యేక అలవెన్సులు మంజూరు చేయవచ్చు. స్టడీ లీవ్ పూర్తయిన తర్వాత ఉద్యోగి తప్పనిసరిగా సర్వీసులో చేరాలి. లేని పక్షంలో సెలవు కాలంలో తీసుకున్న జీతభత్యాలను ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు విధానం ఎలా అంటే.. ఉద్యోగి ఆయా ప్రభుత్వశాఖలను బట్టి కోర్సు వివరాలు, యూనివర్శిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ వివరాలను తెలుపుతూ ఉన్నతాధికారుల (స్పాన్సరింగ్ అథారిటీ ) ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. దానికి ప్రభుత్వం సదరు ఉద్యోగికి ఎడ్యుకేషన్ లీవ్ మంజూరు చేస్తుంది. అలా సెలవు మంజూరు చేయకుండా ఏ ప్రభుత్వ ఉద్యోగి అనధికారికంగా రెగ్యులర్ కోర్సు చేయడానికి వీలు లేదు.
-ఉద్యోగులపై క్రిమినల్ కేసులు ఎప్పుడు నమోదు చేస్తారంటే
భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్ ) సెక్షన్ 318 అనేది మోసం కు సంబంధించిన నేరాన్ని సూచిస్తుంది. పాత ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 420 స్థానంలో ఈ కొత్త సెక్షన్‌ను తీసుకువచ్చారు. ప్రభుత్వ అనుమతి లేకుండా రెగ్యులర్ కోర్సులు చదవడం ప్రభుత్వాన్ని మోసం చేయడం క్రిందకే వస్తుంది. అలాంటి ఉద్యోగులపై సంబంధిత ప్రభుత్వశాఖల అధికారులు క్రిమినల్ కేసులు పెడతారు. ఆ సమయంలో వారికి 7ఏళ్లు జైలు శిక్ష, పెనాల్టీ పడే అవకాశం ఉంటుంది. మోసం తీవ్రతను బట్టి ఒక్కోసారి రెండూ పడొచ్చు. ఇపుడు స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామం శాఖలోని పశుసంవర్ధక సహాయకులు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందుస్తు అనుమతి అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ( ఫండమెంటల్ రూల్స్(ఎఫ్ఆర్- 84 & 85) ప్రకారం, ఉద్యోగుల విద్యావసరాల కోసం స్టడీ లీవ్ ప్రభుత్వం మంజూరు కాకుండానే రెగ్యులర్ గా విద్య అభ్యసించి.. అదే సమయంలో ప్రభుత్వ విధులు కూడా రెగ్యులర్ గా చేశారు. ఆ నేరంపై పశుసంవర్ధక శాఖ అధికారులు ముందు కేసులు పెట్టాలి. కానీ ఇక్కడ ప్రభుత్వం వారికి నోటీసులు ఇచ్చి ..ఉద్యోగులు ఇచ్చిన వివరణను రాష్ట్రప్రభుత్వ పరిశీలనకు పంపారు. అదే సమయంలో రెగ్యులర్ ఉద్యోగులు..రెగ్యులర్ కోర్సులు చేసి.. ఆ సర్టిఫికేట్లు సమర్పించిన సమయంలో విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయని ప్రభుత్వశాఖల అధికారులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగులతోపాటు, కార్యాలయ అధికారులు సిబ్బంది కూడా ప్రభుత్వాన్ని మోసం చేసినట్టు అయ్యింది. ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగులను విధి నిర్వహణ నుంచి తొలగించే అధికారం కూడా ప్రభుత్వానికి వుంటుంది..!




