​(అల్లూరి సీతారామరాజు-ఈరోజు, ఏప్రిల్ 01)మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రెవిన్యూ డివిజనల్ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు, తహసీల్దార్ త్రివేణి గ్రామ రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి రెవెన్యూ సేవలు, పట్టాదారు పాస్ పుస్తకాల సవరణలు మరియు ప్రజల ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ​రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో అధికారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని తహసీల్దార్ ఆదేశించారు. డ్రాఫ్ట్ పాస్ పుస్తకాలను ఈకేవైసీ ద్వారా సరిచూసి, ఎలాంటి తప్పులు దొర్లకుండా తహసీల్దార్ లాగిన్‌లో సవరణలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ​మ్యుటేషన్లు, కొత్త రైస్ కార్డులు మరియు వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చే దరఖాస్తులను నిర్ణీత గడువులోపు మాత్రమే పరిష్కరించాలని, ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పించకూడదని హెచ్చరించారు. ముఖ్యంగా పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, వాటిని సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ​ప్రభుత్వ సేవలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వస్తున్నఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని ఆర్డీవో పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి, ప్రభుత్వ సేవలు పొందే విధానం, ఫోన్ కాల్స్‌కు స్పందించే తీరుపై వివరించాలని అధికారులను ఆదేశించారు. ​రెవెన్యూ యంత్రాంగం ప్రజల పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలని, కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందేలా సేవలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, అన్ని గ్రామాల వీఆర్వోలు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.