(ఈరోజు-నర్సీపట్నం, నక్కపల్లి, అనకాపల్లి, యలమంచిలి)
ఉరుకుల పరుగుల యాంత్రిక జీవితంలో చాలా మంది రుచికంటే ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో ఇపుడు అందరి దృష్టి ఆరోగ్యాన్ని పెంపొందించే మార్గంలో పడింది. మరీ ముఖ్యంగా స్వీట్స్ విషయానికి వస్తే ‘బరువు పెరుగుతామేమో’ లేదా ‘షుగర్ వస్తుందేమో’ అన్న భయం అందరిని వెంటాడుతుంది.. అయితే మన పూర్వీకులు అందించిన చిరుధాన్యాల గొప్పతనాన్ని, సంప్రదాయ అరిసెల రుచిని కలిపి వండితే ఏర్పడే మంచి మిఠాయిలే ఈ “రాగి బెల్లం అరిసెలు”. ఇవి బియ్యం అరిసెల కంటే బగుంటాయి. ఆరోగ్యాన్ని ఇస్తాయి. మనకి ఇంట్లో పండగలు వచ్చినా లేదా ఇంట్లో ఏదైనా స్వీట్ తినాలనిపించినా.. చిటికెలో చేసుకునేంత సింపుల్ రెసిపీ కూడా ఇదే.
-రాగి బెల్లం అరిసెలకి కావలసిన పదార్థాలు:
రాగి పిండి: 2 గ్లాసులు, బెల్లం: 1 గ్లాసు రాగి పిండికి అర గ్లాసు కంటే కొంచెం ఎక్కువ (ఆర్గానిక్ బెల్లం మరీ శ్రేష్టం), నీళ్లు: అర గ్లాసు (పాకం కోసం), నువ్వులు: అరిసెలపై అద్దుకోవడానికి, నూనె: వేయించడానికి సరిపడా, చిన్న ఎండుకొబ్బరి ముక్కలు(ఇది కంప్లీట్ గా ఆప్షనల్), కొద్దిగా నెయ్యి.
-తయారీ విధానం తెలుసుకుంటే..
ముందుగా రాగి పిండి తీసుకొని, అందులో కొద్దికొద్దిగా నీళ్లు చల్లుతూ తడి పొడిగా కలుపుకుని 2 గంటలు పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో బెల్లం, నీళ్లు పోసి కరిగించాలి. బెల్లం కరిగిన తర్వాత వడకట్టి, మళ్లీ పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. నీళ్లలో పాకం వేస్తే అది ఉండ కట్టే వరకు (ఉండ పాకం) ఉడికించాలి. పాకం రాగానే స్టవ్ ఆపేసి, రాగి పిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా బాగా కలపాలి. పిండి అంతా పాకంలో బాగా కలిసేలా చూసుకోవాలి. ఆ సమయంలోనే నెయ్యి వేసుకోవాలి.. ఇష్టం ఉన్నవారు చిన్న ఎండుకొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు.
అలా ముద్దాగా తయారుచేసుకున్న పిండిని ఒక ప్లాస్టిక్ కవర్ లేదా అరిటాకుపై కొంచెం నూనె లేదా నెయ్యి రాసి, అద్దుకొని.. దానిపై నువ్వులు చిలుకరించి అద్దుకొని అరిసెలా మార్చుకోవాలి. ఇక్కడ మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకుంటే అరెసలు బాగుంటాయి. మీడియం వేడి ఉన్న నూనెలో దోరగా వేయించుకోవాలి. అరిసె గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి రాగానే తీసి, అరిసెల గరిటెతో గట్టిగా నొక్కి ఎక్స్‌ట్రా నూనెను గట్టిగా పిండుకోవాలి. లేదంటే అరెసెలకి నూనె బాగా పట్టేస్తుంది. ఈ రాగి బెల్లం అరిసెలు కాల్చుకునేటప్పుడు మంటను ఎప్పుడూ మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచాలి, లేదంటే పైన మాడిపోయి లోపల ఉడకవు. అలాంటివి తినడానికి కూడా అంతగా బాగోవు. 1 కిలో రాగి పిండికి ముప్పావు కిలో బెల్లం సరిగ్గా సరిపోతుంది.
-రాగి అరిసెలకు తయారీలో ఇవి పాటించాలి
రాగి అరిసెలు తయారు చేసుకునే సమయంలో మంచి నువ్వులు, నెయ్యి, మరీ ముఖ్యంగా రసాయనాలు కలపని బెల్లాన్ని వాడుకోవడం ద్వారా.. వాటి దుష్ప్రభావాలు వాటిని తినే పిల్లలపై పడకుండా ఉంటాయి. అరిసెలు ఒత్తుకున్న తరువాత నువ్వులలో ఒత్తుకునే సమయంలో కాస్త ఎక్కువగా నువ్వులు ఒత్తుకోవడం ద్వారా అరిసె ముక్క ముక్కలోనూ నువ్వుల ఫ్లేవర్ తగులుతుంది. ఇక ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవడం ద్వారా వాటి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. కొందరు నువ్వు ఎక్కువగా వినియోగించి ఎండు కొబ్బరిని స్కిప్ చేస్తారు. కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు.
-పిల్లలకు, పెద్దలకూ ఎంతో మంచి ఆరోగ్యం ఇచ్చే స్వీట్
ఎంతో పోషకాలుండే పాత కాలం నాటి రాగి అరిసెలు పిల్లలకు పెట్టడం ద్వారా పిల్లల్లో రక్తహీన తగ్గుతుంది. బెల్లం, నువ్వుల్లో ఉండే కాలిష్యం ఎముకలకు మంచి బలాన్ని ఇస్తాయి. అనునిత్యం బయట ఫుడ్ పెట్టే తల్లిదండ్రులు ఇలాంటి ఆరోగ్య కరమైన స్వీట్ పెట్టడం ద్వారా పిల్లల ఆరోగ్యాన్ని పెంపొందించిన వారు అవుతారు. అయితే పిల్లలు వీటిని ఇష్టంగా తినాలంటే అరెసలు ఒత్తుకునే సమయంలో పిల్లలకు ఇష్టమైన బొమ్మలు, వాటి ఆకారాల రూపంలో తయారు చేస్తే పిల్లలు మరీ ఇష్టంగా తింటారు. అలా ఒత్తుకునే స్టీల్ డైస్ మార్కెట్ లో కూడా ఇపుడు లభ్యం అవుతున్నాయి. ఇవి పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఎంతో మంచిది. బెల్లంతో చేస్తున్నవే కనుక సుగర్ ఒకేసారి పెరిగిపోతుందనే భయం కూడా అక్కర లేదు.




