(ఈరోజు-అనకాపల్లి, నర్సీపట్నం, నక్కపల్లి, యలమంచిలి)
నిత్యం ఏవేవో వంటకాలు తినేవారికి వారాంతంలోనూ.. వాతావరణం చల్లగా ఉండే సమయంలో చక్కని డిష్ గా సాంబార్ రైస్ ఎన్నో మార్కులు కొట్టేస్తుంది. బిర్యానీలు, పలావులు, ఫ్రైడ్ రైస్ లతో పోల్చుకుంటే వెజిటబుల్ సాంబార్ రైస్ కడుపుకి తృప్తిని ఇవ్వడమేకాదు. ఎంతో మనస్పూర్తిగా నోటి రుచిని తీర్చే అన్నంగా కూడా పేరుకొట్టేస్తుంది. అలాంటి సాంబార్ రైస్ ఇపుడు అందరూ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంట్లో తాజా కూరగాయలతో చేసుకునే సాంబార్ రైస్ కి.. హోటల్ నుంచి తెచ్చుకుని తినే సాంబార్ రైస్ కి చాలా తేడా వుంటుంది. మనం ఎంతో చక్కటి పదార్ధాలతో చేసుకునే ఈ సాంబార్ రైస్ ఎంతో రుచిగా వుంటుంది. పైగా ఎంతో ఆరోగ్యం కూడాను. . లంచ్ బాక్స్‌కు, ఆఫీసు లేదా పిల్లలకు పెట్టి పంపటానికి తక్కువ సమయంలో తయారయ్యే ఆహారమే కాదు మంచి బలవర్ధకమైన ఆహారం కూడా. ఈ సాంబార్ రైస్ ను. ప్రెజర్ కుక్కర్‌లో 30 నిమిషాల్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..!
-సాంబార్ రైస్ కావాల్సిన పదార్థాలు
బియ్యం: 1 కప్పు, సాధారణ కందిపప్పు: పావు కప్పు, ఎర్ర కందిపప్పు పావుకప్పు (30 నిమిషాలు నానబెట్టాలి), కూరగాయలు: క్యారెట్, బీన్స్, మునగకాయ, వంకాయ, బంగాళదుంప, టొమాటో, సొరకాయ ముక్కలు, కొత్తిమీర, సాంబార్ పొడి: 2-3 టేబుల్ స్పూన్లు(మనం ఇంట్లో తయారు చేసుకున్న దనియాలతో కూడి సాంబార్ పొడి అయితే మరీ బెటర్), చింతపండు రసం: నిమ్మకాయంత లేదా తగినంత , బెల్లం: చిన్న ముక్క (ఆప్షనల్ ఇది వాడితే రుచి పెరుగుతుంది), నెయ్యి లేదా నూనె: 2-3 టేబుల్ స్పూన్లు, పోపు పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు, ఉప్పు
-తయారీ విధానం తెలుసుకుంటే..
కుక్కర్‌లో నానబెట్టిన బియ్యం, పప్పు, అన్ని కట్ చేసిన ఏడు రకాల కూరగాయలు, 4-5 కప్పుల నీళ్లు, పసుపు, కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెజర్ తగ్గాక మూత తీసి, చింతపండు రసం, సాంబార్ పొడి, బెల్లం తగినంత ఉప్పు వేసి కలపుకొని.. రైస్ కాస్త లూజుగా ఉండటం కోసం అవసరమైతే కొంచెం నీళ్లు పోసి మరో 5-10 నిమిషాలు చిన్న మంటపై ఉడికించుకోవాలి.
-పోపువేసుకోవడమే ఇక్కడ రుచిని పెంచేది
స్ట్ వ్ మీద చిన్న పాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేడి చేసుకోవాలి.. ఇక్కడ చాలా మంది నూనె వాడతారు..అలా కాకుండా ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి వాడటం ద్వారా మంచి రుచి వస్తుంది. ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు వేయించుకొని పోపును సాంబార్ రైస్‌లో కలిపుకోవాలి.. పోపువేసుకునేటపుడు ఎండుమిరపకాయలను చిదమకుండా అలాగే కాయలుగా వేసుకోవాలి.. అవి కాస్త బాగా వేగాలి. పోపు మాడుతోంది అనే ముందు దించేసి పోపుని రైస్ లో కలుపుకొని వెంటనే మూత పెట్టేయాలి ఆ వాసన బయటకు పోకుండా మొత్తం అన్నానికి పడుతుంది. ఆ ఫ్లేవర్ సాంబార్ రైస్ కి మరింత రుచిని తీసుకొస్తుంది. సాంబార్ రైస్ చల్లారిన తర్వాత కాస్త గట్టిపడుతుంది. కాబట్టి కాస్త పలచగానే ఉండేలానే కుక్కర్ విజిల్స్ అయిపోయిన తరువాత పొయ్యిపై పెట్టేటపుడు అడ్జెస్ట్ చేసుకోవాలి.
-సాంబార్ రైస్ లోకి మంచింగ్ ఏమిటంటే
వేడి వేడి సాంబార్ రైస్ లో సరైన మంచింగ్ అయితే ఆవకాయ అనే చెప్పాలి. కొంత మంది అయితే పోపుని కూడా ఆవకాయ పచ్చడిలోని నూనెతోనే పెట్టుకుంటారు. అప్పడాలు, చల్ల మిరపకాయలు, నిమ్మకాయపచ్చడి కూడా ఎంతో బావుంటుంది. పచ్చడితో వడ్డిస్తే సూపర్ కాంబినేషన్ గా వుంటుంది. సాంబార్ రైస్ కి కూరగాయలు తాజాగా ఉంటే చక్కటి రుచి వస్తుంది. మనం సాంబార్ రైస్ లోకి వినియోగించే 7 కూరగాయల్లో చాలా పోషకాలు ఉంటాయి. రైస్, పప్పు, కూరగాయలు అన్నీ ఒకే దానిలో లభించడంతో పాటు, సాంబార్ ఫ్లేవర్ రుచిని మరింత పెంచుతుంది. పిల్లలు, పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.




