(ఈరోజు-నర్సీపట్నం, నక్కపల్లి, యలమంచిలి, అనకాపల్లి)
ఈరోజుల్లో సాయంత్రం స్నాక్ ఐంటే సమోసా.. ఈ సమోసాల్లో కూడా చాలా రకాలే వచ్చేశాయి. అందులో ఆలూ సమోసా, స్వీట్ కార్న్ సమోసా, చికెన్ సమోసా, పన్నీస్ సమోసా ఒకటి కాదు రెండు కాదు..దేనితోనైనా ఇపుడు సమోసాలను తెగ తయారు చేస్తున్నారు. అందులోనూ.. మాంస ప్రియులకు చికెన్ సమోసా కోసం వేరేగా చెప్పాలా చెప్పండి. అయితే ఎప్పుడూ ఈ తరహా సమోసాలు మనకి బ్యాకరీల్లోనే ఎక్కువగా దొరుకుతుంటాయి. కానీ ఇపుడు ఆ స్టైల్ లో సమోసాలు మనం కూడా ఇంట్లోనే చేసుకోవచ్చంటే.. మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ.. అంతేకాదు తక్కువ ఆహార పదార్థాలతోనే మనం దీనిని అద్భుతంగా సిద్ధం చేసుకోవచ్చు. అన్ని అమర్చుకుంటే.. కేవలం వంట గదిలో దొరికే వస్తువులతోనే ఇంట్లోనే హోటల్ స్టైల్ చికెన్ సమోసాలు చేసుకోవచ్చు. అద్భుతమైన రుచి నాణ్యమైన చికెన్‌ను ఎంచుకోవడం ద్వారా మీరు ఎంతో ఆరోగ్యకరంగా వీటిని తయారు చేసి.. హోటల్ వారికి మీరేమీ తీసి పోరని కూడా రుజువు చేయవచ్చు. ఈ విషయంలో మీరు మొదటిసారి ప్రయత్నిస్తున్నా, పక్కా కొలతలతో ట్రై చేస్తే మాత్రం చాలా సులభంగా వీటిని తయారు చేయవచ్చు. అద్భుతమైన ఫిల్లింగ్ కరకరలాడే పై పొర కలిసిన ఈ కాంబినేషన్ మీ సాయంత్రాలను ఆనందబరితం చేసుకోవచ్చు.. అంతే కాదండీ మీలోని నలభీముడిని బయటకు తీసి.. అతిథులకు కూడా చక్కగా తినిపంచవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఇపుడే చికెన్ సమోసా ఎలా చేయాలో తెలుసుకుందాం...
-చికెన్ సమోసాకి కావలసిన పదార్థాలు:
మైదా పిండి: 1 కప్పు , చికెన్ కీమా (సన్నగా తరిగినది): 250 గ్రాములు, ఉల్లిపాయ: 1 (పెద్దది, చిన్న ముక్కలుగా తరిగినది), అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు: 2-3 (సన్నగా తరిగినవి), ఓమా: 1 టీస్పూన్, పసుపు: పావు టీస్పూన్, కారం పొడి: రుచికి తగినంత, గరం మసాలా: ½ టీస్పూన్, ఉప్పు: రుచికి సరిపడా, నెయ్యి లేదా నూనె: 2-3 టేబుల్ స్పూన్లు (పిండి కోసం), కొత్తిమీర ఆకులు: తగినంత, కరివేపాకు కొద్దిగా (ఇది చక్కటి ఫ్లేవర్ ని ఇస్తుంది), సమోసాలు వేయించడానికి నూనె సరిడినంత
-ఇక తయారీ విధానం ఎలాగో చూద్దాం..
ముందుగా ఒక గిన్నెలో మంచి మైదా పిండి ఉండలు లేకుండా ఉన్నదానిని తీసుకుని, వామ్ము, రుచికి సరిపడా ఉప్పు, నెయ్యి వేసి బాగా కలపాలి. ఇందులో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ గట్టి పిండి ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండిని సుమారు 20 నుండి 30 నిమిషాల పాటు పక్కన పెట్టి నాననివ్వాలి. ఇలా చేయడం ద్వారం సమోసా పొర చక్కగా వేగుతుంది.. కర కరలాడుతుంది. ఈలోపు సమోసాలోకి నాన్ వెజ్ మెటీరియల్ కోసం.. చికెన్ ఫిల్లింగ్ కోసం, స్టవ్ మీద బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. అందులో తరిగినన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి మెత్తబడే వరకు దోరగా వేయించుకోవాలి. ఆపై అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాక, చికెన్ కీమా, పసుపు, కారం, గరం మసాలా ఉప్పు వేసి బాగా ఉడికించాలి. ఆకరుగా కరివేపాకు వేసుకోవాలి. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకుని దానిని క్రిందికి దింపేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు నానబెట్టిన పిండిని చిన్న ఉండలుగా చేసి, పూరీల్లా పలుచగా ఒత్తుకోవాలి. వీటిని సగానికి కోసి, కోన్ ఆకారంలో మడుచుకోవాలి. సిద్ధం చేసుకున్న చికెన్ మసాలాతో మధ్యలో నింపి, అంచులకు నీటినిగానీ, మైదా పేస్ట్ ని రాసి గట్టిగా క్లోజ్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడి చేశాక, సమోసాలను వేసి మధ్యస్థ మంట మీద బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు చక్కగా వేయించాలి. అంతే, కరకరలాడే వేడివేడి చికెన్ సమోసాలు రెడీ అయిపోతాయి. వీటిని పుదీనా చట్నీ లేదా కెచప్‌తో సర్వ్ చేస్తే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. ఇక్కడ చిన్న చిట్కా ఏమిటంటే..సమో చికెన్ కర్రీ తయారు చేసుకునే టపుడు టెస్టీగా ఉంటే విధంగా.. మైల్డ్ గా వచ్చేలా చేసుకోవాలి. అంతేకాదు.. చికెన్ కీమాలో బోన్స్ లేకుండా చూసుకోవాలి.. మేరినేటెడ్ చికెన్ అయితే ఈ సమోసా రుచి అమాంతం రెండింతలు చేస్తుందని గుర్తుంచుకోవాలి.




