(ఈరోజు-నర్సీపట్నం, నక్కపల్లి, యలమంచిలి, అనకాపల్లి)
మిల్లెట్స్‌లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అందుకే.. వీటిని రెగ్యులర్ గా తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.. ఉదయం అల్పాహారం కోసం సాధారణ ఇడ్లీల స్థానంలో ఇపుడు చెప్పే రాగి ఇడ్లీలను చేర్చుకోవడం సరైన ఎంపిక.. రాగి ఇడ్లీలు అత్యంత పోషకమైన, ఫైబర్, కాల్షియం అధికంగా ఉండే ఆరోగ్యకరమైన అల్పాహారం.. ఎండాకాలంలో శరీరాన్ని చల్లబరచడంలోనూ కీలకంగా వ్యవహరిస్తయి. వేడిని తగ్గించేందుకు మనకి ఎంతగానో సహాయపడతాయి.. అంతేకాకుండా.. కడుపును చల్లగా ఉంచి.. ఉదర బాగాన్ని రక్షించడంలోనూ ముందుంటాయి. రాగి ఇడ్లీలు రెగ్యులర్ గా తింటే.. ఇవి బరువు తగ్గించడమే కాదు.. డయాబెటిస్‌ను నియంత్రించడంలో కూడా తమవంతు పాత్ర పోషిస్తాయి, ఎముకలను బలోపేతం చేయడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక భూమి పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మరీ ముఖ్యంగా గ్లూటెన్ రహితమైనవి కావడం వల్ల పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇది చాలా మంచి ఆహారం అవుతుంది.
సాధారణ ఇడ్లీ పిండి మాదిరిగా పులియబెట్టాల్సిన అవసరం లేకుండా, కేవలం కొన్ని నిమిషాల్లోనే మెత్తటి – స్పాంజీ లాంటి రాగి ఇడ్లీలను తయారు చేసుకోవచ్చునని కూడా ఇక్కడ అందరం తెలుసుకోవాలి. సాధారణంగా పులియబెట్టకుండా చేసే రాగి ఇడ్లీలు గట్టిగా ఉంటాయని అనుకుంటారు.. కానీ ఈ ప్రత్యేక విధానం ద్వారా చేసే ఇడ్లీలు రెగ్యులర్‌గా చేసే ఇడ్లీల కన్నా చాలా సాఫ్ట్‌గా వస్తాయి. అంతేకాదు మనం తినే ఫుడ్ మనకి కూడా ఒక కొత్త దనాన్ని ఇస్తుంది. ఈ రాగి ఇడ్లీలలో పీచు పదార్థం, అవసరమైన పోషకాలు నిండి ఉండటం వలన ఉదయాన్నే లేదా తేలికపాటి రాత్రి భోజనానికి అద్భుతంగా పనిచేస్తాయి.
-తక్షణ రాగి ఇడ్లీ తయారు చేసుకునే విధానం:
ముందుగా ఒక పాన్‌లో అర టేబుల్‌స్పూన్ నూనె వేడి చేసుకోలి. నూనె వేడెక్కాక, ఒక టేబుల్‌స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టేబుల్‌స్పూన్ మినపప్పు, అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత, ఒక టేబుల్‌స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక టేబుల్‌స్పూన్ సన్నగా తరిగిన కరివేపాకు, పావు కప్పు తురిమిన క్యారెట్ వేసి సన్నటి సెగపై వేయించాలి. మీకు ఇష్టం అనుకుంటే బీట్ రూట్ కూడా వేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర, తోటక కూర, పాల కూర కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత, ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి కనీసం 5-10 నిమిషాల పాటు సన్నటి సెగపై కమ్మటి వాసన వచ్చేంతవరకు వేయించుకోవాలి. రవ్వ చక్కగా వేగితే ఇడ్లీ రుచి బాగుంటుందని మనం గుర్తుంచుకోవాలి. రవ్వ కొద్దిసేపు వేగిన తర్వాత, అదే కప్పుతో ఒక కప్పు రాగిపిండి వేసి రెండు-మూడు నిమిషాల పాటు కాస్త వెచ్చబడేంతవరకు వేయించుకోవాలి. ఇక చివరగా అన్నింని సమంగా అయ్యాయని అనుకున్నతరువాత స్టవ్ ఆపి ప్రక్కన పెట్టుకొని చల్లార బెట్టుకోవాలి.
ప్రక్కన ఉన్న పిండి గోరువెచ్చగా అయిన తర్వాత, రుచికి సరిపడా ఉప్పు, అలాగే మనం రవ్వ, పిండిని కొలిచిన అదే కప్పుతో రెండు కప్పుల పెరుగు వేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా పులిసిన పెరుగు వాడితే ఇడ్లీలు మరింత రుచిగా ఉంటాయి. మృదువగా కూడా వస్తాయి. పెరుగు వేసి కలిపిన తర్వాత, అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. ఆ తరువాత పిండిని మూత పెట్టి, కనీసం 15-20 నిమిషాల పాటు నానబెట్టుకోవడానికి ప్రక్న ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం వేసుకున్న రవ్వ పెరుగును పీల్చుకుని గట్టిపడుతుంది. నానబెట్టిన తర్వాత, మూత తీసి తిరిగి ఒకసారి కలిపి, అర టీస్పూన్ వంట సోడా వేయాలి. వంట సోడా వేసాక కొద్దిగా నీళ్లు వేసుకుని, ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీకి సరిపడా సర్దుబాటు చేసుకోవాలి. పులిసిన పెరుగు, వంట సోడా కలవడం వల్ల ఇడ్లీలు పొంగి, ఫ్లఫీగా ఎంతో బాగా వస్తాయి. పిండిలో ఎయిర్ గ్యాప్స్ ఏర్పడి, ఇడ్లీలు మెత్తగా మారతాయి. అవి సాధారణ ఇడ్లీలతో పోల్చితే ఎంతో బాగుంటాయి.
-ఇడ్లీలు ఆవిరి మీద ఉడికించడం..
ఇపుడు ఇడ్లీ స్టీమర్‌లో నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఇడ్లీ ప్లేట్లపై పల్చటి కాటన్ క్లాత్‌ను తడిపి వేసుకోవాలి, దానిపై ఇడ్లీ పిండిని మనకి కావాల్సిన ఇడ్లీల సైసులో వేసుకోవాలి. నూనె లేదా నెయ్యి రాసిన ప్లేట్లలో కూడా నేరుగా ఇడ్లీలు వేసుకోవచ్చు. ఎవరికి అవకాశం ఉన్నవిధంగా వాళ్లు చేసుకోవచ్చు. ఇడ్లీ పాత్రలో ప్లేట్లు ఉంచి, మధ్యస్థ మంటపై పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. స్టవ్ ఆపిన తర్వాత రెండు నిమిషాలు ఉంచి, ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్లను బయటికి తీసి ఇడ్లీలను సర్వ్ చేసుకోవచ్చు. ఇలా చేసిన ఇడ్లీలు నోట్లో అలా కరిగిపోయేంత మెత్తగా, స్పాంజీగా ఎంతో చక్కగా వస్తాయి. ఈ ఇడ్లీలను ఏ పచ్చడితో సర్వ్ చేసినా చాలా బాగుంటాయి, ముఖ్యంగా టమాటా చట్నీ, పల్లీ, అల్లం చట్నీతో కూడా ఎంతో బాగుంటాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రాగి ఇడ్లీలను మీ ఇంట్లోనే తయారు చేసి.. మీ కుటుంబ పెద్ద ఆరోగ్యాన్ని కాపాడంలో మీవంతు బాధ్యతను నెరవేర్చండి.. పనిలో పనిగా మీ ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోండి.




