(ఈరోజు-అనకాపల్లి, నర్సీపట్నం, నక్కపల్లి, యలమంచిలి)
మిఠాయిలు అంటే పంచదారతోకాకుండా స్వచ్చమైన బెల్లం..నేతితో చేసినవి అయితే ఆరోగ్యానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. చిన్నపిల్లలు స్వీట్లు కావాలని మారాం చేస్తే.. పాత అమ్మమ్మల కాలం నాటి ఆరోగ్యకరమైన బెల్లం నెయ్యి కలగలిపిన సున్నండలు పెట్టడం ద్వారా వారి ఆరోగ్యం పెరగడమే కాదు.. పిల్లలకు కూడా త్వరగా ఎదగడానికి ఆస్కారం వుంటుంది. వారి ఎముకలు కూడా బలిష్టంగా మారతాయి. అలాంటి సున్నండలు పిల్లకు ఇవ్వడం ద్వారా వారి మిఠాయిలు తినే కోరిక తీరడంతోపాటు. వారి ఆరోగ్యాన్ని కూడా తల్లిదండ్రులుగా కాపాడిన వారం అవుతాము.
-సున్నండలకి కావలసిన పదార్థాలు:
మినపగుళ్ళు 1 1/2 కప్పులు, పొట్టు మినుములు 1/2 కప్పు (మొత్తం సుమారు 1/2 కిలో), బెల్లం 1 1/2 నుండి 2 కప్పులు (రుచికి తగ్గట్టుగా, సుమారు 400 గ్రాములు నుండి 1/2 కిలో), నెయ్యి: 3/4 కప్పు, బియ్యం 2 టేబుల్‌స్పూన్లు, యాలకులు 5-6..
-లడ్డూ తయారీ విధానం
మినుములు వేయించడం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో లేదా పాన్‌లో 1 1/2 కప్పు మినపగుళ్ళు, 1/2 కప్పు పొట్టు మినుములను తీసుకోండి. మంటను మధ్యస్థంగా (మీడియం ఫ్లేమ్) పెట్టి, మినుములు లోపలి వరకు బాగా వేగే వరకు సుమారు 10-12 నిమిషాలు నిరంతరం కలుపుతూ వేయించండి. ఇవి చక్కగా వేగినప్పుడు కమ్మని వాసన వస్తుంది. రంగు కూడా ఎరుపులోకి మారుతుంది. ఓపికగా వేయించడం ద్వారా లడ్డూలు మంచి రుచిని పొందుతాయి.
-బియ్యం కలిపి వేయించుకోవడం:
మినుములు దోరగా వేయించుకున్నాక, అందులోకి రెండు టేబుల్‌స్పూన్ల బియ్యాన్ని కలపుకోవాలి. బియ్యం వేయడం వల్ల సున్నుండలు తినేటప్పుడు పంటికి అతుక్కోకుండా ఉంటాయి. బియ్యం కలిపిన తర్వాత మరో ఒకటి 2 నిమిషాలు వేయించండి. బియ్యం రంగు మారి, ట్రాన్స్‌పరెంట్ గా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, మినుములను ఒక గిన్నెలోకి తీసుకుని పూర్తిగా చల్లారపెట్టుకోవాలి.
-పప్పును గ్రైండ్ చేసుకునే విధానం :
మినుములు పూర్తిగా చల్లారిన తర్వాత, వాటిని చిన్న మిక్సీ గిన్నెలో కొద్దికొద్దిగా తీసుకుంటూ గ్రైండ్ చేసుకొని మెత్తని పిండిగా ఆడుకోవాలి. పెద్ద మిక్సీ గిన్నెలో ఒకేసారి గ్రైండ్ చేస్తే పప్పు సరిగా నలగదు. పప్పును వీలైనంత మెత్తగా కొద్ది కొద్దిగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. అయితే లడ్డూలు తినేటప్పుడు రుచిగా ఉండటానికి కొద్దిగా బరకగా ఉంచుకోవడం మంచిది. మంచి ఫ్లేవర్ కోసం పప్పు గ్రైండ్ చేసేటప్పుడే 5-6 యాలకులను కూడా వేసి మెత్తగా ఆడుకోవాలి. అపుడు పిండికి మంచి అరోమా వస్తుంది.
-బెల్లం కలుపుకోడం :
పప్పు అంతా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత, అందులోకి 1 1/2 నుండి 2 కప్పుల బెల్లం తీసుకోవాలి.. తీపిని బట్టి బెల్లం పరిమాణాన్ని మార్చుకుంటూ ఉండాలి. 1/2 కిలో పప్పుకి 400 గ్రాముల బెల్లం కరెక్టు గా సరిపోతుంది. మరింత తీపి కావాలనుకుంటే 1/2 కిలో బెల్లం కూడా మనం వేసుకోవచ్చు. బెల్లాన్ని పిండిలో కలిపి, మళ్ళీ కొద్దికొద్దిగా మిక్సీ గిన్నెలోకి తీసుకుంటూ బెల్లం పిండిలో పూర్తిగా కలిసిపోయేలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
-సున్నుండలు చుట్టుకునే విధానం :
చివరిగా, సున్నండలు చుట్టడానికి నెయ్యిని సిద్ధం చేసుకోవాలి. మనం ఏ కప్పుతో పప్పును కొలిచామో, అదే కప్పుతో 3/4 కప్పు నెయ్యిని ఒక గిన్నెలోకి తీసుకుని కరిగించి, గోరువెచ్చగా ఉండేలా వేడి చేసుకోవాలి. పిండిలోకి మొత్తం నెయ్యిని ఒకేసారి కలపకుండా, కొద్దికొద్దిగా పిండిని తీసుకుంటూ, దానికి సరిపడా నెయ్యిని కలుపుతూ ఉండలుగా చుట్టుకోవాలి. ఈ పద్ధతిలో నెయ్యి తక్కువగా పడుతుంది, సున్నుండలు చక్కగా వస్తాయి. మొత్తం పిండికి నెయ్యిని కలుపుకుంటూ సున్నుండలను తయారు చేసుకోవాలి. మనం ఉపయోగించే నెయ్యి బయట కొన్నది కాకుండా ఇంట్లోనే తయారు చేసుకున్నదైతే సున్నండలు మంచి సువాన రావడమే కాకుండా.. ఎంతో రుచిగా కూడా ఉంటాయి. ఇలా అత్యంత సులువుగా కమ్మనైన బెల్లం సున్నుండలు ఇంట్లో తయారు చేసుకొని పిల్లలకు అందించవచ్చు. చిన్నవి అయితే రోజుకి ఒకటి.. కాస్త పెద్దవి అయితే రెండు రోజులకి ఒకటి చొప్పున పెట్టవచ్చే. ఈ సున్నండలతో పిల్లలకు ఆరోగ్యం పెరుగుతుంది. ఆకలి బాగా వేస్తుంది. పిల్లల ఎములక ఎదుగుదలకు కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఇవి అచ్చం పాత కాలం అమ్మమ్మలు చేసి పెట్టిన రుచితోనే ఉంటాయి. ఎంతో ఆరోగ్యాన్నిచ్చే బెల్లం సున్నండలను ఇంట్లోనే తయారు చేసుకొని పిల్ల ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి.




