(ఈఎన్ఎస్-విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం, అల్లూరి పాడేరు)
రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు అమలు చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల హెల్తు స్కీమ్ ను మరో ఏడాది అనగా 2026-27 కు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామని అనకాపల్లి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు, పబ్లిక్ బ్యూరో చీఫ్ యర్రా నాగేశ్వర్రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం హెల్త్ స్కీమ్ పొడిగించడం ముదావహం అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, ఆరోగ్యశాఖ మంత్రి ఈ సందర్భంగా ధన్యవాదములు తెలియజేస్తున్నామన్నారు. ప్రస్తుత కాలంలో జర్నలిస్టులకు హెల్త్ స్కీమ్ చాలా అవసరం అన్నారు. కొందరు నిరుపేద జర్నలిస్టులపై ఆర్ధిక భారం పడకుండా ఉండేందుకు అక్రిడేటెడ్ జర్నలిస్టులకు జర్నలిస్టు హెల్త్ కార్డు ప్రీమియం చెల్లించడానికి ముందుకి వచ్చిన జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణణ్ కు కూడా ధన్యవాదములు తెలియజేస్తున్నామన్నారు. జర్నలిస్టులకు హెల్త్ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని.. అనకాపల్లి జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి పధంలో నడిపిస్తున్న జిల్లా కలెక్టర్ విజయక్రిష్ణణ్ జర్నలిస్టుల ఆరోగ్యం కోసం కూడా మంచి మనసుతో ఆలోచించి ముందుకి వచ్చారని కొనియాడారు. జర్నలిస్టులకు జిల్లా కలెక్టర్ చెల్లిస్తున్న హెల్త్ కార్డ్ ప్రీమియం అంశాన్ని జర్నలిస్టులంతా గుర్తుంచుకుంటారని అన్నారు. అదే సమయంలో సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు ప్రెస్ అక్రిడిటేషన్లు పెంచాలని కోరారు. దాని కోసం సమాచారశాఖ మంత్రి ద్వారా కమిషనర్ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా రాష్ట్రప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం వలన స్థానిక పత్రికల్లో పనిచేసే అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు రావడానికి వీలుపడుతుందన్నారు. తద్వారా హెల్త్ కార్డు దరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. అక్రిడిటేషన్ లేకపోతే హెల్త్ కార్డుకి దరఖాస్తు చేసుకునే అవకాశం లేని విషయాన్ని రాష్ట్రప్రభుత్వం, రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్ గుర్తించాలని కోరారు.