(విశాఖపట్నం-ఈరోజు ప్రధానప్రతినిధి)
గ్రామ, వార్డు సచివాలయంలో ఉద్యోగమంటే రెగ్యులర్ ఉద్యోగమని సంబర పడిన కుటుంబాలకు నేడు కడుపుశోకమే మిగులుతోంది.. పనిఒత్తిడితో కొందరు, అధికారుల వేధింపుల వలన మరికొందరు ఉద్యోగులు మృత్యువాత పడుతుంటే.. ఇపుడు ఏకంగా మతి బ్రమించి అదృశ్యం కూడా అయిపోతున్నారు. ఆ విధంగానే ఘటనే విశాఖ జీవీఎంసీ పరిధిలోని 462 సచివాలయం ఏరియాలో ఎలక్ట్రికల్, ఎమెనిటీస్ అసిస్టెంట్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న గొరుపూటి జయబాబు శనివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయారు. శనివారం ఉదయం ఇంట్లో నుండి బయటకు వెళ్లిన ఆయన, అప్పటినుంచి తిరిగి రాలేదు. కనీసం తన మొబైల్ ఫోన్, పర్స్, బైక్ వంటివి ఏవీ కూడా తీసుకెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దానితో కుటుంబ సభ్యులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆయన కొత్తపాలెం ఏరియాలో నివాసం ఉంటు జయబాబు అదృశ్యం అయిన రోజు నుంచి పోలీసులు సిసి టివి ఫుటేజిల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

-అధికారుల వేధింపులు, తీవ్ర మానసిక ఒత్తిడే కారణం
అదృశ్యమైపోయిన ఉద్యోగిపై గత కొంతకాలంగా పై అధికారుల నుండి విపరీతమైన పని ఒత్తిడి తెస్తున్నారని.. వేధింపులకు గురి చేస్తున్నారని తెలుస్తోంది. ఊపిరి సలపని విధులు, అందులోనే సర్వేలు.. అన్నీ చేయి సమయానికి కార్యాలయానికి వచ్చేయాలనే ఆదేశాలు ఉద్యోగులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. రాష్ట్రంలో 75 ప్రభుత్వశాఖలుంటే అత్యంత తక్కువ పేస్కేలు ఉన్నది ఒక్క సచివాలయ శాఖలోనే. ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాల విషయం మాట్లాడితే ప్రభుత్వం చేయాలని తప్పించుకుంటున్న అధికారులు.. పని ఒత్తిడి మాత్రం ప్రభుత్వం చెబితనే తాము చేస్తున్నామని ఒంటికాలపై లేస్తున్నారు. చాలీచాలని సమయాలతో తీవ్రమైన పని భారాన్ని నెట్టడమే కాకుండా, ఇటీవల ఆయనను సస్పెండ్ కూడా చేసినట్లు సమాచారం. ఈ సస్పెన్షన్ నిర్ణయంతో ఆయన తీవ్రమైన మానసిక వేదనకు, ఆందోళనకు గురయ్యారని సన్నిహితులు చెబుతున్నారు. ఒకవైపు పని ఒత్తిడి, మరోవైపు సస్పెన్షన్ వేటుతో మనస్తాపం చెంది ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

-మూడు నెలల క్రితమే వివాహం.. కన్నీరుమున్నీరవుతున్న భార్య:
అదృశ్యమైపోయిన అమినీస్ కార్యదర్శి ఇన్చార్జి ఏఈ జయబాబుకు మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆ యువతి, పెళ్లయిన కొద్ది రోజులకే భర్త ఇలా ఒత్తిడికి గురై అదృశ్యం కావడంతో షాక్‌కు గురైంది. ఉన్నతాధికారుల కఠిన నిర్ణయాలు, వేధింపుల వల్లే తన భర్తకు ఈ పరిస్థితి వచ్చిందని, ఇప్పుడు తన పరిస్థితి ఏంటని సదరు మహిళ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఒక పచ్చని సంసారంలో ఇలాంటి విషాదం చోటుచేసుకోవడంతో సహచర ఉద్యోగులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. అయితే శనివారం అదృశ్యం అయిపోయిన జయబాబు బ్రతికి ఉన్నాడో లేదోనని అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో శివాజీ నగర్ పనిచేస్తున్న మహిళా పోలీసు కూడా తీవ్ర ఒత్తిడికి గురై ఆసుపత్రి పాలై చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆ విషయం ఉద్యోగు అదృశ్యమైన ఉద్యోగి కుటుంబాన్ని భకపెడుతున్నది.

-ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి
జయబాబు ఆచూకీ కోసం పోలీసులు, కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. ఈయనకు సంబంధించిన సమాచారం ఏమైనా తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు గానీ, లేదా మీ వార్డు గ్రూపులలో గానీ సమాచారం అందించి సహాయం చేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు.కొత్తపాలెం ఏరియాలో 462 సచివాలయంలో పనిచేస్తున్న ఈయనకోసం తెలిసినవారు.. చూసిన ఎక్కడైనా కనిపిస్తే సమాచారం అందించాలని కూడా సహచర సచివాలయ ఉద్యోగులు సోషల్ మీడియాలో సమాచారాన్ని షేర్ చేస్తున్నారు. ఏది ఏమైనా జీవిఎంసీలో అధికారులు సచివాల ఉద్యోగులనున వేధిస్తున్న తీరు తారా స్థాయికి చేరుకుందని మరోసారి స్వర్ణవార్డు ఉద్యోగి అదృశ్యంతో మరోమారు రుజువైంది. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి..!