(ఈరోజు-నర్సీపట్నం, నక్కపల్లి, యలమంచిలి, అనకాపల్లి)
సాధారణంగా రాగి(సోళ్లు) అనగానే రాగి సంగటి లేదా అంబలి మాత్రమే మనకి గుర్తొస్తూ ఉంటాయి.. కానీ రాగి పిండి, బెల్లంతో నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే ‘రాగి బర్ఫీ’లాంటి స్వీట్ కూడా చేసుకోవచ్చుననండి. తినడానికి స్వీట్ లా ఉన్నా దీనితో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని చాలా సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు. శరీరానికి కావాల్సిన క్యాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ స్వీట్, కేవలం 15-20 నిమిషాల్లో ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. స్వీట్ తినాలనిపించినప్పుడు ఆరోగ్యానికి హాని చేసే చక్కెర పదార్థాల కంటే, ఇలా ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి, రసాయనాలు కలపని బెల్లంతో చేసే ఈజీగా చేసుకునే ఈ రాగి బర్ఫీ తీపికి తీపి.. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. ఎంతో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ రాగి బర్ఫీని ఏవిధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం..!
-రాగి బర్ఫీకి కావలసిన పదార్థాలు:
రాగి పిండి: 1 కప్పు, బెల్లం తురుము: ఒకటింపావు కప్పు, నీళ్లు: 2 కప్పులు, నెయ్యి: అర కప్పు (సుమారు 5-6 టేబుల్ స్పూన్లు), బొంబాయి రవ్వ (సుజీ): పావు కప్పు, యాలకుల పొడి: సువానకు, రుచి పెరిగేవిధానానికి, జీడిపప్పు పలుకులు: ఒక గుప్పెడు,
-తయారీ విధానం తెలుసుకుంటే..
ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని, అందులో 2 చెంచాల నెయ్యి వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు పలుకులను వేసి దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అనంతరం అదే పాన్‌లో 1 కప్పు రాగి పిండి, పావు కప్పు బొంబాయి రవ్వ వేసి తక్కువ మంట మీద 8-10 నిమిషాల పాటు పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.. బొంబాయి రవ్వ వేయడం వల్ల బర్ఫీకి మంచి టెక్స్చర్ వస్తుంది. మరొక పక్క గిన్నెలో ఒకటింపావు కప్పు బెల్లం తురుము, 2 కప్పుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి.. బెల్లం కరిగి నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. దీనికి పాకం రానవసరం లేదు.
తరువాత.. ముందుగా వేయించి పెట్టుకున్న రాగి పిండిలో మరిగించిన బెల్లం నీళ్లను వడకడుతూ పోసుకోవాలి. ఈ టైంలో పిండి ఉండలు కట్టకుండా గరిటెతో వేగంగా కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు మధ్యమధ్యలో నెయ్యి వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. మిశ్రమం పాన్‌కు అతుక్కోకుండా విడిపోతున్నప్పుడు యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు కలుపుకోవాలి. మిశ్రమం అంతా ముద్దలా అయ్యి నెయ్యిని వదులుతున్నప్పుడు, ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్‌లోకి తీసుకోవాలి. పైన సమానంగా సర్ది 15-20 నిమిషాల పాటు చల్లారబెట్టుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత, మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కోసుకుంటే ఎంతో రుచికరమైన రాగి బర్ఫీ రెడీ అయిపోతుంది. ఈ స్వీట్ తయారు చేసుకునే టప్పుడు కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా అనుకున్నట్టుగా స్వీట్ రావడానికి ఆస్కారం వుంటుంది. పిండి వేయించేటప్పుడు మాడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే స్వీట్ చేదుగా వచ్చేస్తుంది. అలాగే బెల్లం తీపిని మీ రుచికి తగినట్లుగా కొంచెం పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా నెయ్యి కూడా ఇంట్లో తయారు చేసుకున్నది అయితే స్వీట్ మంచి రుచి, సువానగా కూడా వుంటుంది.
-రాగా బర్ఫీ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే..
రాగి పిండి – బెల్లంతో కలిపి చేసుకున్న ఈ బర్ఫీ రుచిలోనే కాదు, ఆరోగ్య పరంగా కూడా అద్భుతమైన ప్రయోజనాలను శరీరానికి అందిస్తుంది. ధాన్యాలన్నింటిలోకెల్లా రాగుల్లో క్యాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది కనుక దాని ద్వారా వచ్చే కాల్షియం శరీరంలోని దంతాలకు, ఎములకు ఎంతోగా బాగా ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా పిల్లల్లో ఎదుగుదలకు, వృద్ధుల్లో వచ్చే ఎముకల బలహీనతను నివారించడానికి ఇది ఎంతగానో సహకరిస్తుంది. అలాగే రాగి పిండిలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది, దానికి తోడు మనం చక్కెర బదులు రసాయనాలు కలపని బెల్లం వాడుతున్నాం కనుక బెల్లంలో కూడా ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో రక్తం(హిమోగ్లోబిన్) బాగా పెరుగుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇది ఒక అద్భుతమైన పోషక ఆహారం అంటే అతిశకయోక్తి కాదేమో.
రాగిలో గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దానితో రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగడానికి ఆస్కారం వుండదు. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదిగా జరిగేలా చేసి, షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచడానికి ఎంతో సహాయ పడుతుంది. రాగిలో ఉండే ‘ట్రిప్టోఫాన్’ అనే అమైనో ఆమ్లం ఆకలిని తగ్గించడంలో చక్కగా ఉపయోగపడుతుంది. రాగిలో ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల దీనిని కొద్దిగా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. తద్వారా మళ్లీ ఏదైనా తినాలనే తలంపురాకుండా చేస్తుంది. ఇది మన శరీరంలోని అనవసరమైన కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. రాగి పిండి సులభంగా జీర్ణమవుతుంది కాబట్టి ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఇది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జీర్ణ ప్రక్రియను సాఫీగా సాగేలా చేయడంలో కీలక భూమిక పోషిస్తుంది.
రాగులు(సోళ్లు) శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో చాలా చక్కగా పనిచేస్తాయి. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం చాలా వరకు మనకి తగ్గుతుంది. అలాగే రాగిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు సహజమైన రిలాక్సంట్‌గా పనిచేస్తాయి.. ఇది మానసిక ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలను తగ్గించడంలో కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ బర్ఫీలో ఉపయోగించే స్వచ్ఛమైన నెయ్యి చర్మ ఆరోగ్యానికి, మెదడు చురుకుదనాన్ని ఇస్తుంది. బయటి మిఠాయిల కంటే ఇంట్లోనే ఇలా ఆరోగ్యకరమైన పదార్థాలతో ఆరోగ్యాన్ని పెంపొందించే మిఠాయిలు చేసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఆరోగ్యం కూడా. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న రాగి బర్ఫీని మీరు కూడా ఒక్కసారి చేసి ఇంట్లో ని పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ పెట్టండి. దాని ప్రయోజనాలు మి కుటుంబం మొత్తం పంచుకోండి.




