(ఈరోజు-నర్సీపట్నం, నక్కపల్లి, అనకాపల్లి, యలమంచిలి)
జంక్ ఫుడ్ రాజ్యమేలుతున్న ఈరోజుల్లో.. మళ్లీ పాత కాలం నాటి ఆరోగ్యం పెంపొందించే ఆహారంపై అందరూ మక్కువ చూపిస్తున్నారు. నేటి యాంత్రిక జీవనంలో మనం మన సంప్రదాయ ఆహారాలను మర్చిపోతున్నా.. ఆరోగ్యం పాడైపోతున్న వేళ మళ్లీ రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే ఆహారాలను ప్రతీ ఒక్కరూ గుర్తు చేసుకోవడమే కాదు వారి దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకుంటున్నారు. పూర్వీకులు ఎంతో ఆరోగ్యంగా, ధృడంగా ఉండటానికి ప్రధాన కారణం వారు తీసుకునే చిరుధాన్యాల ఆహారమే అంటే అతిశయోక్తి కాదేమో. అటువంటి బలమైన, రుచికరమైన వంటకాల్లో జొన్న సంగటి (జొన్న బువ్వ) ఒకటి. ఇది తినడానికి ఎంత రుచిగా వుంటుందో అంతకు మించి ఆరోగ్యాన్ని కూడా మనకి ఇస్తుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ప్రాచుర్యం పొందిన ఈ వంటకం ఆరోగ్య రీత్యా దేశమంతా చక్కర్లు కొడుతున్నది. దినుసులన్నీ ఉంటే పక్కాగా మనం కూడా ఇంట్లోనే చేసుకొని మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. అది పక్కా కొలతలతో ఏ విధంగా ఎలా తయారు చేయాలో మనం తెలుసుకుందాం.

-జొన్న సంగటికి కావలసిన పదార్థాలు:
జొన్నలు: 1 కప్పు (తెల్ల లేదా పచ్చ జొన్నలు), నీళ్లు: 4 నుండి 5 కప్పులు, ఉప్పు: రుచికి సరిపడా, కొద్దిగా నెయ్యి

-తయారు చేసుకునే విధానం:
ముందుగా ఒక కప్పు జొన్నలను తీసుకుని శుభ్రంగా కడిగి, కనీసం 8 గంటలు లేదా రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల జొన్నలు మెత్తగా ఉడకడమే కాకుండా త్వరగా జీర్ణమవుతాయి. వాటి ఫలితం శరీరానికి కూడా పడుతుంది. నానిన జొన్నలలోని నీటిని పూర్తిగా వడకట్టుకుని.. తర్వాత వాటిని మిక్సీ జార్‌లో వేసి మరీ మెత్తని పిండిలా కాకుండా, కొంచెం బరకగా (రవ్వలా) గ్రైండ్ చేసుకోవాలి. అలా చేసుకున్న తరువాత.. స్టవ్ మీద మందపాటి గిన్నె లేదా కుక్కర్ పెట్టి, ఒక కప్పు జొన్న రవ్వకు సుమారు 4 నుండి 5 కప్పుల నీటిని పోసి బాగా మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇక నీళ్లు మరుగుతున్నప్పుడు, సిద్ధం చేసుకున్న జొన్న రవ్వను వేస్తూ గరిటతో ఉండలు కట్టకుండా కంటిన్యూస్‌గా కలుపుకోవాలి. స్టవ్ మంటను తక్కువగా ఉంచి, మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ దగ్గరపడే వరకు ఉడికించాలి. మీరు కుక్కర్‌లో వండుతున్నట్లయితే 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే సంగటి చాలా మెత్తగా వస్తుంది. మిశ్రమం దగ్గరపడి మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనివ్వాలి. అది గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి.

-సర్వింగ్ టిప్, ఆరోగ్య ప్రయోజనాలు
ఈ జొన్న సంగటిని ఏ కూరతో నైనా తీసుకోవచ్చు. కానీ వేరుశనగ పచ్చడి, టమాటో పచ్చడి అయితే రుచిగా వుంటుంది. ఇంకా దానికి నాన్ వెజ్ యాడ్ చేయాలనుకుంటే మాత్రం నాటు కోడి పులుసు వంటి కూరలతో తింటే అద్భుతమైన రుచిని ఇస్తుంది. ఇది కేవలం రుచిలోనే కాదు, శరీరానికి కావలసిన శక్తిని అందించడంలోనూ చాలా చక్కగా పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి , బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక పోషక విలువల నిధి అని చెప్పవచ్చు. ఇపుడు జంక్ ఫుడ్ తిని శరీర బరువు పెరిగిన వాళ్లంతా వాళ్ల బరువుని రివర్స్ చేసుకోవడానికి జొన్న సంగటినే వినియోగిస్తున్నారు. దీనిని క్రమం తప్పకుండా 45 రోజులు తీసుకుంటే ఖచ్చితంగా 5 నుంచి 8 కేజీల వరకూ బరువు తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణు చెబుతున్నారు. జొన్న సంగటని తినడం ప్రారంభించిన దగ్గర నుంచి మంచినీరు అధికంగా తీసుకోవడం, సాయంత్రం కనీసం రెండు గంటల వ్యాయామం, రెండుగంటలు వర్కవుట్ చేస్తే రిజల్డ్ పక్కాగా వుంటుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. మరెందుకు ఆలస్యం ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చి బరువుని తగ్గించడంతో పాటు సుగర్ ను కంట్రోల్ చేసే జొన్న సంగటి మీరూ మీ రోజువారి ఆహారంలో చేర్చుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి..!