(ఈరోజు-నర్సీపట్నం, నక్కపల్లి, అనకాపల్లి, అల్లూరి పాడేరు, విశాఖపట్నం)
ప్రస్తుతం కాలంలో హోటల్ లో వాడే వస్తువుల కంటే నాణ్యమైన వస్తువులు మార్కెట్ లో అందుబాటులో దొరుకుతున్నాయి. మనకి తెలియాల్సిందల్లా ఒక్కటే ఏ రెసిపీ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన పక్కా కొలతలు. అన్నీ తెలిస్తే.. ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్‌తో కమ్మని, సువాసనభరితమైన పనీర్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవచ్చు. దానిని తిన్నవారంతా ఆహా ఏమి రుచి అనేలా కూడా చేయొచ్చు. అలాంటి సింపులు రెసిపీ మీ కోసమే అంతిస్తున్నాం. పనీర్ పీసులు సాఫ్ట్ టెక్స్చర్, కరకరలాడే కూరగాయలు, సోయా సాస్ ఫ్లేవర్ కలిసి ఈ ఫ్రైడ్ రైస్‌కి నెక్ట్స్ లెవల్ టేస్ట్ ఇస్తాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే ఈ ఫ్రైడ్ రైస్ సాయంత్రం పూట చాలా చక్కగా వుంటుంది. దానికి మంచి వెజ్ కర్రీ యాడ్ చేసుకొని.. చిల్డ్ రైతాని జోడిస్తే ఇక తగ్గేదేలే.. టేస్ట్ వేరే లెవల్ అన్నమాట.. ఇంకెందుకు ఆలస్యం పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసేద్దాం రండి..

-ఫ్రైడ్ రైస్ కి కావలసిన పదార్థాలు..
బాస్మతి అన్నం - 2 కప్పులు (ముందుగా వండి చల్లార్చినది), పనీర్ - 150 గ్రాములు (చిన్న ముక్కలుగా కట్ చేసినవి), నూనె లేదా నెయ్యి, లేదా బట్టర్ - 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ - 1 (సన్నగా పొడవుగా తరిగినది), క్యారెట్ - పావు కప్పు ఫైన్ గా చాప్ చేసినది, బీన్స్ - పావు కప్పు చిన్న ముక్కలు, క్యాప్సికమ్ - పావు కప్పు దీనిని పొడవుగా కట్ చేయాలి, పచ్చిమిర్చి - 2 దీనికి కూడా పొడవుగా కట్ చేయాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్, సోయా సాస్ - 1 టీస్పూన్, వెనిగర్ - 1 టీస్పూన్, చిల్లీ సాస్ - 1 టీస్పూన్ (ఐచ్చికం), మిరియాల పొడి - 1 టీస్పూన్, ఉప్పు - తగినంత, కొత్తిమీర - కొద్దిగా రుచి కోసం, ఉల్లికాడలు, గార్నిష్ కోసం,

-ఏవిధంగా తయారు చేయాలంటే..
ముందుగా ఒక పాన్‌లో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేడి చేసుకోవాలి. అందులో పనీర్ ముక్కలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయేవరకు వేయించుకోవాలి, ఆపై ఉల్లిపాయ, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ వేసి హై ఫ్లేమ్‌పై 2-3 నిమిషాలు దోరగా వేయించుకోవాలి. మనం వేసిన కూరగాయలన్నీ సగం మాత్రమే ఉడికేలా చూసుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికితే ముద్దగా అయిపోతాయని గుర్తుంచుకోవాలి. తరువాత కొద్దిగా సోయా సాస్, వెనిగర్, చిల్లీ సాస్ వేసి బాగా కలపాలి. సాస్‌లను ఎక్కువగా వేయకూడదు. అలా చేస్తే అసలు రైస్ రుచి తగ్గిపోతుంది. ఇపుడు ముందుగా సిద్ధం చేసుకున్న బాసుమతి అన్నం, వేయించిన పనీర్ ముక్కలను పాన్‌లో వేసి జాగ్రత్తగా కలపాలి. రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి చల్లి హై ఫ్లేమ్‌పై రెండు నిమిషాలు టాస్ చేసుకోవాలి. రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఆఖరులో ఫ్లేవర్ కావాలనుకునే వారు ఒక స్పూను నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఇక చివరిగా కొత్తిమీర, ఉల్లికాడలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక దానికి చిల్డ్ రైతా.. టామాటా సాల్ లేదా.. వెజ్ సూప్ తో కలిపి సర్వ్ చేసుకోవడమే. గుమ గుమ లాడే రెస్టారెండ్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ని స్పూన్ స్పూన్ ఆశ్వాదిస్తూ తినడమే.

-రెసిపీలో ఈ చిట్కాలు తప్పని సరి చేస్తే రుచి అద్బుతం
పన్నీర్ ఫ్రైడ్ రైస్ రుచిగా రావాలంటే బాసుమతి అన్నం పొడిపొడిగా ఉండేలా చూసుకోవాలి. తాజాగా వండుకున్న వేడి అన్నంతో చేస్తే రైస్ మెత్తగా అయిపోతుంది. అందుకే ముందుగా వండి పూర్తిగా చల్లార్చి ఉపయోగిస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అలా వండే టపుడు అన్నంతో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేస్తే అన్నం పొడి పొడి లాడుతూ వుంటుంది. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ గా చేసుకున్నదైతే బయటకు వచ్చే అరోమా చాలా చక్కగా వుంటుంది. నాణ్యమైన నాటు కొత్తిమీరను వేసుకోవడం ద్వారా మంచి సువాన వస్తుందని గుర్తుంచుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్ మొత్తం ఐరన్ కడాయ్ లో చేస్తే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా.