(ఈరోజు-అల్లూరి పాడేరు, చింతపల్లి, అరకువేలి)
తెలుగు రాష్టాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో తొలకరి చినుకులు అందరినీ పలుకరిస్తున్నాయి.. వాతావరణం కూడా కూల్ కూల్ గా మారబోతుంది. ఇక చాలా మందికి వర్షం పడుతుంటే వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుందికదా. అలాంటపుడు ఈసారి సరికొత్తగా ఈవినింగ్ స్నాక్స్ ట్రైచేయడానికి చూస్తుంటాం.. లేదంటే ఎక్కడైనా దొరికితే అక్కడివెళ్లి ఎంజాయ్ చేస్తాం. కానీ చక్కగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లో ఎప్పుడూ చేసుకునే పకోడీలుగా కాకుండా ఈసారి ఎగ్ పకోడీ రెసిపీ మీ ముందుకి తీసుకు వచ్చాం. మిర్చీ బజ్జీ, ఉల్లి పకోడీ లాంటివి ఎక్కువ తినే వారికి ఈ ఎగ్ పకోడీలు కాస్త డిఫరెంట్ టేస్ట్ ని తెచ్చిపెడతాయి. అంతేకాదు వాటితోపాటు కాస్త ఆరోగ్యాన్ని కూడా తెస్తాయంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి డిఫరెంట్ ఎగ్ పకోడీలు ఒక్కసారి ట్రైచేసి.. టేస్ట్ చేస్తే ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి అని తీరాల్సిందే.. ఇంకెందుకు ఆలస్యం ఎగ్ పకోడీలు ఇంట్లోనే ఎలా చేయాలో ఇపుడు చూసేద్దాం..
-కావాల్సిన పదార్థాలు
తాజా కోడి గుడ్లు మూడు, పావు కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, ఒక పెద్ద ఉల్లిపాయ (పొడవుగా కట్ చేసి పొరలు విడదీయాలి), 2 పచ్చిమిర్చి (సన్నగా తరిగినవి),సన్నగా తరిగిన కొత్తిమీర, అర టీ స్పూన్ కారంపొడి, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ వాము, పావు టీ స్పూన్ పసుపు, వేయించడానికి సరిపడా నూనె. కొద్దిగా కరివేపాకు
-ఇక తయారీ విధానం చూద్దాం
ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లో 3 కోడి గుడ్లను తీసుకుని బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసిన గుడ్లలో పావు కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండివేసి బాగా కలపి.. ఇప్పుడు పొడవుగా తరిగిన ఉల్లిపాయలను వేసుకుని, వాటి పొరలను విడదీసుకోవాలి.. ఆతరువాత, సన్నగా తరిగిన 2పచ్చిమిర్చి కొత్తిమీర, వేసుకోవాలి. అలాగే మంచి రుచి కోసం అర టీ స్పూన్ కారంపొడి, తగినంత ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ వాము, పావు టీ స్పూన్ పసుపు వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత కొన్ని నీళ్లు పోసి పకోడీ తయారు చేసుకునే విధానంలో పిండిని కలిపి పక్కన ఉంచుకోవాలి. తరువాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడ నూనె వేసుకోవాలి. ఎప్పుడైనా సరే నూనె బాగా వేడి అయిన తర్వాత పకోడీ వేసుకోవాలి.
అప్పుడే ఎక్కువ ఆయిల్ పట్టకుండా ఉంటుంది. నూనె బాగా వేడి అయిన తర్వాత మంట కాస్త చిన్నగా పెట్టుకొని, మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని, పకోడిలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. వేసిన తర్వాత రెండు నిమిషాల తర్వాత పకోడి కాస్త కాలుతుంది. తర్వాత దానిని అటు ఇటూ తిప్పుతూ బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. రెండు మూడు నిమిషాల తర్వాత పకోడి పూర్తిగా ఉడికి, వేగిపోతుంది. బంగారు రంగులో కనిపిస్తుంది. అప్పుడు వాటిని తీసి వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. పైన కాస్త ధనియాల పొడి జల్లించుకోవాలి. కొన్ని తరిగిన ఆనియన్స్ కలుపుకొని, వర్షం పడుతున్న సమయంలో వేడి వేడిగా తింటే రుచి మర్చిపోలేరు. ఇక్క అసలైన టిప్ ఏంటంటే..మధ్య మధ్యలో కరివేపాకు కూడా వేసి వేపడం ద్వారా దాని ఫ్లేవర్ కూడా పకోడీలకు పట్టి మరింత రుచిగా వస్తాయి. అంతేకాదు పకోడీలు మంచి అరోమా కూడా వస్తుంది. అంతే పకోడీ లవర్స్ కి వీటిని వేడి వేడిగా అందించడమే.
-రుచితోపాటు ఆరోగ్యం కూడా
సాధారణంగా కోడిగ్రుడ్డు తినని వారు కోడిగ్రుడ్డుతో చేసిన పకోడీలు చాలా ఇష్టంగా తింటారు. ఈ ఎగ్ పకోడీలు రుచే కాదు మంచి ఆరోగ్యం కూడా వీటి ద్వారా మంచి ప్రొటీన్ అందుతుంది. తద్వారా ఆరోగ్యం కూడా పెంపొందించుకోవచ్చు. అయితే ఇక్కడ డీఫ్ ఫ్రై కనుక పకోడీలు వేపిన తరువాత టిష్యూ పేపర్ పై వేసుకోవడం ద్వారా చాలా వరకూ నూనె పీల్చకుండా ఉండేలా చూసుకోవాలి. వీటిని టమాటా కెచప్, చిల్లీ చాస్ తో తింటే ఆ రుచి మరిచిపోలేరు. సాయంత్రం స్నాక్స్ విత్ టీ, కాఫీ త్రాగేవాళ్లకి ఈ ఎగ్ పకోడీలు మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఎడా పెడా ఏవేవో స్నాక్స్ తినేకంటే.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే ఎగ్ పకోడీలు తినడం ద్వారా మన ఆరోగ్యం మన చేతుల్లోనే జాగ్రత్తగా ఉంచుకోవచ్చునని గుర్తించుకోవాలి. కాకపోతే ఇక్కడ చెప్పిన కొలతలన్నీ పక్కాగా ఫాలో అవడం ద్వారా మాత్రమే మనం అనుకున్నట్టుగా ఎగ్ పకోడీలు వస్తాయి.. ఈ రెసిపీని ఒకటికి రెండు సార్లు చదివి మీరూ ట్రైచేయండి..లేదంటే www.eerojy.comలో రెసిపీని లైన్ బై లైన్ చదువుతూ చేయండి.. మంచి మంచి వంటకాలను ఆశ్వాదించండి.




