(ఈరోజు-అల్లూరి పాడేరు, అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచిలి)
ఆకు కూరల్లో పాలకూరది ప్రత్యేక స్థానం. ఈ పాలకూరలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండగా, శనగపిండి ప్రోటీన్లను అందిస్తుంది. ఈ రెండింటి కలయికతో తయారయ్యే పాలక్ పకోడీలు రుచికరంగా ఉండటమే కాకుండా పోషకాహారంగా పేరు సంపాదించాయి. త్వరగా తయారయ్యే సాయంత్రపు స్నాక్ కోసం ఇది అద్భుతమైన ఎంపికగా చెప్పుకోవచ్చు. ప్రతినిత్యం కొత్తదనాన్ని కోరుకునే వారికి ఈ తరహా వంటకాలు భలే నచ్చుతాయి లేండి. ఇంకెందుకు ఆలస్యం మనమూ ఇంట్లో పాలకూర పకోడీలు ఓ సారి ట్రైచేద్దాం రండి.

-పాలక్ పకోడీలకు కావలసిన పదార్థాలు
2 కప్పుల పాలకూర తరుగు (బాగా కడిగి సన్నగా తరిగినది, 1 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు బియ్యప్పిండి, 1/4 టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ అల్లం-కారం పేస్ట్, 1/2 టీస్పూన్ వాము, 1 టీస్పూన్ చాట్ మసాలా, 1/2 టీస్పూన్ బేకింగ్ సోడా, తగినంత ఉప్పు, వేయించడానికి నూనె, పకోడీలు మంచి ఫ్లేవర్ రావడానికి కాస్త కరివేపాకు కూడా

-ఇక తయారీ విధానం చూస్తే..
ముందుగా ఒక పకోడీ బాండీలో తరిగిన పాలకూరను తీసుకుని అందులో శనగపిండి, బియ్యప్పిండి వేసి బాగా కలపుకోవాలి. ఆ తర్వాత పసుపు, వాము, అల్లం-కారం పేస్ట్, చాట్ మసాలా, బేకింగ్ సోడా, ఉప్పు వేసి మరోసారి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీరు పోస్తూ చిక్కటి పిండిమిశ్రమాన్ని తయారు చేయాలి. పిండి మరీ పల్చగా కాకుండా, పాలకూరకు బాగా పట్టేలా ఉండాలి. దీంతో పకోడాలు కరకరలాడుతూ వస్తాయి. తర్వాత ఒక బాణలిలో నూనె వేడి చేసుకోవాలి. నూనె సరిపడా వేడెక్కిన తర్వాత పిండిమిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దులుగా కాకుండా పెద్ద ఉండలుగా కాకుండా మధ్యస్తంగా పకోడీలు వేసినట్టు వేసుకోవాలి. . మధ్యస్థ మంటపై బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ప్రతీ వాయకి ఆఖరులో ఓ గుప్పెడు కరివేపాకు దించే సమయంలో వేసి వేసుకోవడం ద్వారా పకోడీలకు మంచి ఫ్లేవర్ వస్తుంది. వేయించిన పకోడాలను టిష్యూ పేపర్‌పై తీసి అదనపు నూనె తొలగించాలి. అనంతరం వేడివేడి పాలక్ పకోడాలను పచ్చి చట్నీ, టమాటో సాస్ లేదా ఒక కప్పు వేడి టీతో వడ్డించాలి. కరకరలాడే టెక్స్చర్, అద్భుతమైన రుచి, ఆరోగ్య ప్రయోజనాలతో పాలకూర పకోడాలు అలా సాయంత్రం చల్లగాలిలో సర్వ్ చేస్తే.. ఆహా ఏమి రుచి అంటూ లొట్టలేసుకుంటూ తినేస్తారు. చూశారు కదా.. ఈ పాలకూర పకోడీ రెసిపీ మీరు కూడా ఓసారి ట్రైచేయండి.. సాయంత్రం చల్లగాలిలో వేడి వేడి పకోడీలు తింటూ.. ఎంజాయ్ చేయండి..!